సాక్షి, న్యూఢిల్లీ : డాక్టర్లు డాక్టర్లను, లాయర్లు లాయర్లను, కలెక్టర్లు కలెక్టర్లను, యాక్టర్లు యాక్టర్లను వివాహం చేసుకోవడం ఇప్పటివరకు చూశాం. కానీ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేని వివాహం చేసుకోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అంతేకాకుండా వీరిద్దరూ ఒకేపార్టీ వారు కావడంతో పాటు, వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు కావడం మరో విశేషం. వివరాల్లోకి వెళితే.... ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్‌తో పంజాబ్‌లోని షహీద్ భగత్‌సింగ్ నగర్ ఎమ్మెల్యే అంగద్ సింగ్ షైని వివాహం నవంబర్ 21న ఢిల్లీలో జరుగనుంది. ఈ మేరకు అతిథులకు ఆహ్వానాలను ఇప్పటికే అందించారు. వీరిద్దరూ ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందిన వారు కాగా, ఒకే ఏడాది ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం యాదృచ్ఛికం.
అదితి తండ్రి అఖిలేష్ కుమార్ సింగ్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవగా, అంగద్ సింగ్ షైనీ తండ్రి దిల్‌బాగ్ సింగ్ నవాన్‌షహర్ అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు స్థాయిలో ఆరు సార్లు ఎన్నికయ్యారు. ఇక పంజాబ్ అసెంబ్లీలో అంగద్ సింగ్ షైనీ మిగతా ఎమ్మెల్యేల కంటే వయసులో చిన్నవాడు. అలాగే అదితి సింగ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో వయసులో చిన్న ఎమ్మెల్యే. అంగద్ కంటే అదితి వయసులో నాలుగేళ్లు పెద్ద. వీరి వివాహ రిసెప్షన్ నవంబర్ 23న నిర్వహించనున్నారు. కాగా, అదితి సింగ్ 90వేల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment