గురువారం స్పీకర్ పోచారంను కలసి తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటూ వినతిపత్రం సమర్పిస్తున్న 12 మంది కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ శాసన సభాపక్షాన్ని అధికార టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న ఆ పార్టీ శాసనసభ్యుల వినతికి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనాన్ని ధ్రువీకరిస్తూ శాసనసభ కార్యదర్శి గురువారం రాత్రి బులెటిన్ విడుదల చేశారు. దీంతో ఇన్నాళ్లూ శాసనసభలో 19 మంది సభ్యులుగల కాంగ్రెస్ పార్టీ బలం ఇకపై ఆరుకే పరిమితం కానుంది. ‘రాష్ట్ర శాసనసభలో 18 మంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షంలో మాకు మూడింట రెండొంతుల బలం ఉంది. మమ్మల్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలి’ అంటూ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి తీర్మాన ప్రతిని అందజేశారు.
భారత రాజ్యాంగం 10వ షెడ్యూలు నాలుగో పేరాలోని రెండో సబ్ పేరాను అనుసరించి తక్షణమే తమను టీఆర్‌ఎస్ సభ్యులుగా గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ శాసనసభా పక్షానికి చెందిన 12 మంది సభ్యుల విలీన ప్రతిపాదనకు తాము అంగీకరిస్తున్నట్లు టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం కూడా స్పీకర్‌కు లేఖ రాసింది. దీంతో ఈ వినతిని స్పీకర్ ఆమోదిం చారు. రాజ్యాంగ నిబంధనల మేరకు 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను టీఆర్‌ఎస్ శాసనసభాపక్షంలో చేరుస్తూ స్పీకర్ కార్యా లయం గురువారం రాత్రి బులెటిన్ విడుదల చేసింది. శాసనసభలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సరసన కొత్తగా చేరిన శాసనసభ్యులకు సీట్లు కేటాయిస్తామని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి. నర్సింహారావు బులెటిన్‌లో పేర్కొన్నారు.
స్పీకర్‌తో 12 మంది ఎమ్మెల్యేలు భేటీ...
టీఆర్‌ఎస్ శాసనసభాపక్షంలో తమను విలీనం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఉన్న స్పీకర్ నివాసంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం చీలికవర్గం నేతలు గురువారం వినతిపత్రం అందజేశారు. ‘మేము కాంగ్రెస్ శాసనసభాపక్షం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. మేం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రకటించారు. టీఆర్‌ఎస్‌లో చేరికపై తాము తీసుకున్న నిర్ణయానికి ప్రజల మద్దతు కూడా ఉందని, రాజ్యాంగబద్ధంగానే టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేయాలని ప్రతిపాదించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.
ఈ ఏడాది మార్చి నుంచి వివిధ సందర్భాల్లో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి గురువారం టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. అనంతరం ఇదివరకే టీఆర్‌ఎస్‌లో చేరిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి తరలి వెళ్లారు. మరోవైపు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది కాంగ్రెస్ శాసన సభ్యులకు టీఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. పార్టీలో చేరిన శాసనసభ్యులకు నియోజకవర్గాల అభివృద్ధిలో సంపూర్ణ తోడ్పాటు ఇవ్వడంతోపాటు పార్టీ వ్యవహారాల్లోనూ ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఉత్తమ్ రాజీనామాతో కసరత్తు వేగవంతం...
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వారిలో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు 11 మంది వివిధ సందర్భాల్లో టీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తమలో విలీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్న టీఆర్‌ఎస్.. కాంగ్రెస్ నుంచి కనీసం రెండొంతుల మంది.. అంటే 13 మంది శాసనసభ్యుల మద్దతు కోసం వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలో శాసన సభ్యత్వానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం రాజీనామా చేయడాన్ని అనుకూలంగా మలుచుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉత్తమ్.. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. నిబంధనల మేరకు బుధవారం తన శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించడంతో టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనానికి అవసరమైన సభ్యుల సంఖ్య 12కు పడిపోయింది.
‘పైలట్’ చేరికతో చకచకా పావులు...
ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 11 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు విడతలవారీగా టీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. ఈ జాబితాలో ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రేగా కాంతారావు (పినపాక), వనమా వెంకటేశ్వర్‌రావు (కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), హరిప్రియా నాయక్ (ఇల్లెందు), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), సుధీర్‌రెడ్డి (ఎల్బీ నగర్), బీరం హర్షవర్దన్‌రెడ్డి (కొల్లాపూర్), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి) గండ్ర వెంకట రమణారెడ్డి (భూపాలపల్లి) ఉన్నారు. ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యేల చేరిక నిలిచింది. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తాండూరు శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరికకు మొగ్గు చూపారు. ఉత్తమ్ రాజీనామా, రోహిత్‌రెడ్డి చేరిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం దిశగా టీఆర్‌ఎస్ వేగంగా పావులు కదిపింది. కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం నేపథ్యంలో ఏడుగురు సభ్యుల బలమున్న ఏఐఎంఐఎం అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment