సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ చకచకా పావులు కదుపుతోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పట్నుంచే టీపీసీసీ పెద్దలు మంత్రాంగం జరుపుతున్నారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్‌ను ఢీకొనేందుకు ‘పంచ’తంత్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ద్వారానే టీఆర్‌ఎస్‌ను ఓడించగలమని విశ్వసిస్తున్న కాంగ్రెస్ పెద్దలు టీడీపీతోపాటు సీపీఐ, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ జన సమితి, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణలను ఒక్కతాటి పైకి తెచ్చి జట్టు కట్టే యత్నాలు ప్రారంభించారు.
ఇప్పటికే చర్చలు షురూ
పాంచ్‌పటాకా వ్యూహంలో భాగంగా ఇతర రాజకీయ పక్షాలతో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చర్చలు ప్రారంభించారని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రాజకీయ కార్యాచరణను రూపొందిస్తామని అధికారికంగా ప్రకటించిన సీపీఐ ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌తో జత కట్టేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసేందుకు తమకు అంగీకారమేనన్న సంకేతాలు ఆ పార్టీ వర్గాల నుంచి ఇప్పటికే వచ్చాయి. అయితే గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన స్థానాలతోపాటు మరికొన్ని అదనంగా ఇవ్వాలన్న ప్రతిపాదన మఖ్దూంభవన్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఎస్సీ వర్గీకరణే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఎమ్మార్పీఎస్ నుంచి ఈసారి ఎన్నికలలో పోటీచేసే విషయమై
ఎటూ తేల్చని మందకృష్ణ.. ప్రతిపక్ష కూటమి పక్షాన ఎన్నికల ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో టీఆర్‌ఎస్ మోసం చేసిందని, కాంగ్రెస్ కూటమిని గెలిపించాలన్న అభిప్రాయంతో ఆయన ఉన్నట్టు సమాచారం.
కోదండతో కలుద్దామా?
రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై కొత్తగా ఆవిర్భవించిన ‘తెలంగాణ జన సమితి’ని కూడా తమ కూటమిలో చేర్చుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. పార్టీ ప్రారంభించేందుకు ముందే కొందరు కాంగ్రెస్ పెద్దలు కోదండను కలిసి మాట్లాడారని, పార్టీ పెట్టకుండా కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేయాలని కోరినట్లు సమాచారం. అయితే కచ్చితంగా పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని కోదండరాం చెప్పడంతో.. ఆ పార్టీ ద్వారా కాంగ్రెస్‌కు నష్టం కలగకుండా చూడాలని ఇరువర్గాలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే కోదండను తమ కూటమిలోకి కాంగ్రెస్ పెద్దలు ఆహ్వానిస్తున్నారు. రాజకీయ జేఏసీ వ్యవస్థాపకుడిగా, ఉద్యమకారుడిగా తెలంగాణ సమాజంలో ఆయనకున్న పలుకుబడి ఉపయోగపడుతుందని, తాము బలహీనంగా ఉన్నచోట్ల కోదండ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపితే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు. ఇందుకు త్వరలోనే కోదండరాంతోపాటు జనసమితి నేతలతో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉండే ఓట్లు చీలకుండా టీడీపీని కూడా కలుపుకుని పోవాలనే ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ నేతలు అడపాదడపా ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నారు. రెండు పార్టీల మధ్య డీల్ కూడా కుదిరిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఉమ్మడి వేదిక తర్వాతే సీట్లపై చర్చ
ముందుగా ఓ అవగాహనకు వచ్చిన తర్వాతే ఏ పార్టీతో అయినా సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతాయని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ఉమ్మడి వేదికపైకి వచ్చిన తర్వాతే అధికారికంగా సీట్ల పంపకాలపై చర్చిస్తామని వారంటున్నారు. టీడీపీ, సీపీఐ, జనసమితి పార్టీలకు ఏయే స్థానాలివ్వాలన్న దానిపై ఇప్పటివరకు పార్టీలో చర్చలు జరగలేదని టీపీసీసీ ముఖ్యుడు ఒకరు చెప్పారు. కానీ ఆ పార్టీలతో కలిసి వెళ్లాలని భావిస్తున్నామని, ఈసారి ఎన్నికల్లో తాము పోటీచేసే స్థానాలు తగ్గుతాయనే సంకేతాలు కూడా నేతలకు పంపామని ఆయన వెల్లడించడం గమనార్హం. ఎన్నికల్లో సీట్లు తగ్గినా అంతిమలక్ష్యం నెరవేరాలంటే కచ్చితంగా కూటమి కట్టాల్సిందేనన్న అభిప్రాయం పీసీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకుగాను కనీసం 30 సీట్లు మిత్రులకు ఇవ్వాల్సి వస్తుందని, తాము 80 స్థానాల వరకు పరిమితమవుతామనే అంచనాలో గాంధీభవన్ వర్గాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment