సాక్షి, హైదరాబాద్: పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి సొంతగూటికి తీసుకొచ్చే యత్నాలను కాంగ్రెస్ ముమ్మరం చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన టీపీసీసీ అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. కాంగ్రెస్ నుంచి వెళ్లిన నేతల్లో ఎమ్మెల్యేల నుంచి ఎంపీటీసీల వరకు ఎంతమందిని వీలుంటే అంతమందిని మళ్లీ తీసుకురావాలని భావిస్తోంది. కొందరితో నేరుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నారు. ఇంకొందరితో దూతల ద్వారా సంప్రదిస్తున్నారు.
ఎక్కడెక్కడ ఎవరు..?
గత ఎన్నికల ముందు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, పోటీచేసి ఓడిపోయిన నేతలు చాలా మంది టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అన్ని స్థాయిల్లో కలిపి వేల సంఖ్యలోనే నాయకులు గులాబీ గూటికి చేరారు. దీంతో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ సంస్థాగతంగా కొంత బలహీనపడింది. అయితే టీఆర్‌ఎస్‌లో చేరినవారు ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ పెద్దలు ఓ నిర్ధారణకు వచ్చారు. ఆ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీచేసి రెండోస్థానంలో నిలిచిన ఓ నేతను మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రేవంత్‌రెడ్డి పార్టీలో చేరుతున్న సమయంలోనే ఆయనతో చర్చలు జరిపినా ఫలించలేదు.
ఆయన టీఆర్‌ఎస్ నుంచి పార్టీలోకి వస్తే జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో కూడా కొంత లాభం జరుగుతుందన్న ఉద్దేశంతో సీనియర్ నేత జీవన్‌రెడ్డి కూడా పలుమార్లు ఈ ప్రతిపాదన తెచ్చారు. ఇటీవల పార్టీలో చేరిన అదే జిల్లాకు చెందిన ఓ నాయకుడు కూడా తాజాగా ఆయన వద్దకు వెళ్లి మంతనాలు జరిపినట్లు సమాచారం. ఏప్రిల్‌లో ఏదో విషయం తేలుస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ అప్పట్నుంచి ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో అసంతృప్తితో ఉన్న ఆ నేతకు బస్సుయాత్ర సందర్భంగా ఉత్తమ్ టచ్‌లోకి వెళ్లినట్లు చెపుతున్నారు. ఈ నేతకు అదే జిల్లాకు చెందిన మరో మాజీ ఎంపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే ఆ మాజీ ఎంపీ కూడా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా తగిన ప్రాతినిధ్యం లభించడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు.
అసంతృప్తులే టార్గెట్
వరంగల్ జిల్లాకు చెందిన ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా నాయకురాలు తనకు టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఆమెతో కూడా టీపీసీసీ పెద్దలు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఇదే జిల్లాకు చెందిన మరో బీసీ ముఖ్య నేత, మాజీ మంత్రి కూడా అదే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. మొదట్నుంచీ టీఆర్‌ఎస్‌లోనే ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన్ను కూడా పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అలాగే కరీంనగర్ జిల్లా సింగరేణి ప్రాంతం నుంచి మరో సీనియర్ నేత కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెపుతున్నారు. టీఆర్‌ఎస్‌లో గ్రూపు తగాదాల కారణంగా అసంతృప్తితో ఉన్న నేతలను జిల్లాలు, నియోజకవర్గాల వారీగా టీపీసీసీ టార్గెట్ చేస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత డీఎస్ ఇటీవల తన ఆవేదనను బహిరంగంగా వెలిబుచ్చడం, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు సైతం టీఆర్‌ఎస్‌లో తమను చిన్నచూపు చూస్తున్నారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment