సాక్షి, హైదరాబాద్: తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం నుంచి బయటపడి 2019 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని తెలం గాణ కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా.. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో కనీసం ఎనిమిది చోట్లనైనా అధికార పార్టీకి గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈ స్థానాలను గుర్తించి అక్కడ పార్టీ బలం పెంచుకునేదిశగా దృష్టి కేంద్రీకరించాలని భావిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ కన్నా కాంగ్రెస్‌కు స్వల్పంగా మెజారిటీ దక్కింది. మరో అరడజను స్థానాల్లో కాంగ్రెస్ కన్నా టీఆర్‌ఎస్.. 50వేల నుంచి లక్షన్నర వరకు ఆధిక్యత సాధించింది. అందుకే ఈ ఎనిమిది స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈసారి కొత్త వర్గాల నుంచి పార్టీకి మద్దతు లభిస్తుందని టీపీసీసీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో నామినేషన్ల సమయానికి అభ్యర్థులను ఖరారు చేయడం కాకుండా, ఈసారి ఒకట్రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా.. ప్రచారానికి కావాల్సిన సమయం తీసుకోవాలని యోచిస్తోంది.
అభ్యర్థుల ఎంపికలో..
లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలనే అధిష్టానం ఆలోచనను కూడా సానుకూలంగా మార్చుకోవాలని టీపీసీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్న ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ జల్లెడపడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో 38వేలు, మహబూబాబాద్‌లో 9వేల ఓట్లను టీఆర్‌ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా సాధించింది. ఈ రెండు స్థానాల్లో మళ్లీ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయనే అంచనాలో కాంగ్రెస్ నేతలున్నారు. తమ పార్టీకి మహబూబాబాద్‌లో నలుగురు, ఖమ్మంలో ముగ్గురు ఎమ్మెల్యేలుండడం ఇందుకు కలిసొస్తుందని భావిస్తున్నారు. మహబూబాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పేరు వినిపిస్తుండగా, ఖమ్మం స్థానానికి రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రల పేర్లను టీపీసీసీ పరిశీలిస్తోంది. ఖమ్మం లోక్‌సభ పరిధిలో వచ్చిన ఫలితాలను బట్టి వలస నేత అయితే బాగుంటుందనే ఆలోచనలో కూడా టీపీసీసీ పెద్దలున్నట్టు తెలుస్తోంది. అటు, భువనగిరిలో 58వేలు, పెద్దపల్లిలో 88వేలు, నల్లగొండ లోక్‌సభ పరిధిలో లక్ష ఓట్లను కాంగ్రెస్ కన్నా టీఆర్‌ఎస్ ఎక్కువగా సాధించింది.
భువనగిరి విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మునుగోడు, నకిరేకల్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం స్థానాల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ పార్లమెంటు పరిధిలో ఆలేరు, భువనగిరి, జనగామ స్థానాల్లో కొంత కష్టపడితే, మిగిలిన చోట్ల సానుకూలత ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, ఇక్కడ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్థానాన్ని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆశిస్తున్నారు. ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందనే ఆశతో ఆయన ఇప్పటికే కార్యక్షేత్రంలోకి దిగారు. అయితే, ఇక్కడ బీసీ నేత అయితే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది. టీఆర్‌ఎస్ ఎలాగూ బీసీ అభ్యర్థినే నిలబెడుతుందని, కాంగ్రెస్ కూడా బీసీని నిలబెడితేనే పోటీ ఇవ్వగలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగైతే.. డీసీసీ మాజీ అధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ పేరును మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రతిపాదిస్తున్నారు. టీపీసీసీ ముఖ్య నేతలు పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్‌ల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇక, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తున్న నల్లగొండ లోక్‌సభ సెగ్మెంట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మాత్రమే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోమటిరెడ్డి కాకపోతే జానా బరిలో ఉండడం దాదాపు ఖాయమని టీపీసీసీ వర్గాలంటున్నాయి. ఇక, పెద్దపల్లిలో కవ్వంపల్లి సత్యనారాయణను బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేగా ఉండగా, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, విజయరమణారావు లాంటి నాయకుల బలం కూడా కలిసొచ్చే అవకాశాలున్నాయి.
ఆ మూడు చోట్ల
జహీరాబాద్, చేవెళ్ల, ఆదిలాబాద్ స్థానాల్లోనూ తమకు బలముందని కాంగ్రెస్ భావిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో.. టీఆర్‌ఎస్ కన్నా జహీరాబాద్‌లో 1.33లక్షలు, చేవెళ్లలో 1.43 లక్షలు, ఆదిలాబాద్‌లో 1.49లక్షల ఓట్లు తక్కువగా పోలయ్యాయి. చేవెళ్లలో టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారయినట్టేనని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ఈస్థానంలో సబితా ఇం ద్రారెడ్డి సహకారం పూర్తిగా లభిస్తే కొండా టీఆర్‌ఎస్‌కు పోటీ ఇస్తారని హస్తం శ్రేణులు భావిస్తున్నాయి. జహీరాబాద్‌లో సురేశ్ షెట్కార్, ఆదిలాబాద్‌లో రమేశ్‌రాథోడ్, అనిల్ జాదవ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ నుంచి రేవంత్‌రెడ్డిని బరిలో దింపితే ఎలా ఉంటుందనే దానిపై కూడా అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద రాష్ట్రంలోని ఏడెనిమిది స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వడం ద్వారా కేడర్‌లో నెలకొన్న నిస్తేజాన్ని తొలగించాలని టీపీసీసీ పెద్దలు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రదేశ్ ఎన్నికల కమిటీని ఏర్పాటుచేశారు. ఏఐసీసీ కార్యదర్శులు, ఇంచార్జితో పాటు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత సభ్యులుగా ఉండే ప్రత్యేక కమిటీ అభ్యర్థుల ప్రతిపాదిత జాబితాను అధిష్టానానికి పంపుతుందని, వచ్చే నెలలో అభ్యర్థులను ప్రకటిస్తారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment