ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్- సీఎం కుమారస్వామి
బెంగుళూరు : కన్నడనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు రెబెల్ ఎమ్మెల్యేలు ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో చర్చలకు ససేమిరా అనడంతో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కుప్పకూలే పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్‌కు మద్దతిస్తానని చెప్పిన రెబెల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు 24 గంటల్లోనే మాటమార్చారు. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తానని శనివారం నాగరాజు శివకుమార్‌తో చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి. కానీ, ఆదివారం ఉదయంకల్లా సీన్ రివర్సయింది. ఆయన యూటర్న్ తీసుకున్నారు. ముంబైలో మకాంవేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసేందుకు నాగరాజు వెళ్లినట్టు సమాచారం. ఆయనతోపాటు మరో ఎమ్మెల్యే సుధాకర్ కూడా రెబెల్ ఎమ్మెల్యేల శిబిరంలో చేరేందుకు వెళ్లనున్నట్టు తెలిసింది.
(చదవండి : రేపే ‘విశ్వాసం’ పెట్టండి)
విశ్వాసం సన్నగిల్లిందా..!
శాసనసభలో బుధవారం ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. తమ ఎమ్మెల్యేలపై పూర్తి విశ్వాసం ఉందని, విశ్వాస పరీక్షలో నెగ్గుతామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. విశ్వాస పరీక్షలో పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే వారి సభ్యత్వాన్ని కోల్పోతారని అన్నారు. ఈ అంశం చట్టంలో స్పష్టంగా ఉందని వెల్లడించారు. అసంతృప్త ఎమ్మెల్యేల డిమాండ్లను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. విశ్వాస పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం శాసనసభాపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇక సంకీర్ణానికి మద్దతిస్తానని చెప్పిన నాగరాజు యూటర్న్ తీసుకోవడంపై ఆయనకు పార్టీ సమర్థతపై విశ్వాసం సన్నగిల్లిందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment