సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే మొదలైన కొద్ది సేపటికే సభలో గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ అరెస్టులు ఆపాలని వాళ్లు నినాదాలు చేస్తున్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలంటూ బీజేపీ తీర్మానం ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ప్రశ్నోత్తారాల సమయం కొనసాగుతున్నందున తర్వాత వాయిదా తీర్మానం చేపడదామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి చెబుతున్నా సభ్యులు వినటం లేదు. తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలన్న వారి డిమాండ్ మధ్యే అధికార పక్ష నేతల ప్రసంగం కొనసాగుతోంది. అయితే కాస్త తగ్గినట్లు కనిపించిన వాళ్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించే సమయంలో మళ్లీ స్వరం పెంచటం విశేషం. సీఎం ప్రసంగం అనంతరం మైక్ అందుకున్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కాంగ్రెస్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేసే హక్కు ఉంది కానీ, ఇది పద్ధతి కాదన్నారు. సీఎం మాట్లాడుతున్నా వినకపోవటం బాధాకరమని అక్బరుద్దీన్ ఈ సందర్భంగా చెప్పారు.
ఇదిలా ఉండగా తెలంగాణ శాసన మండలి నుంచి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. సుమారు గంటన్నర సేపు ప్రశ్నోత్తరాలు కొనసాగగా, అనంతరం సభ వాయిదా పడింది. సభ, మండలిని సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment