
బాగల్‌కోటలో ఆర్‌బి తిమ్మాపుర అనుచరులు టైర్లను కాల్చి నిరసన
అధికార కాంగ్రెస్ భగ్గుమంది. టికెట్లు దక్కకపోవడంతో ఎక్కడికక్కడ అసంతృప్తులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేయడంతో అలజడి రేగింది. కార్యాలయాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించేవరకూ వెళ్లింది. బెంగళూరులో కేపీసీసీ కార్యాలయం కూడా నిరసనలతో హోరెత్తింది. అసంతృప్తులు సహజమేనని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
సాక్షి, బెంగళూరు:ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ఎంతో కసరత్తు చేసి ఆదివారం రాత్రి విడుదల చేసిన 218 మంది అభ్యర్థుల జాబితా అగ్గి రాజేసింది. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అగ్రహోదగ్రులైన నాయకులు ఆందోళనలకు దిగడంతో పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలు, నిరసనలతో పాటు పార్టీ కార్యాలయాల్లో విధ్వంసానికీ వెనుకాడలేదు. హైకమాండ్ నుంచి టికెట్ రాకపోతే రెబల్స్‌గా బరిలో దిగుతామంటూ హెచ్చరించారు. 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపారు. దీంతో వారితో పాటు ఇతర ఔత్సాహికులు ఆందోళనకు దిగారు.
భగ్గుమన్న ఆగ్రహం
♦ బ్యాడిగె ఎమ్మెల్యే బసవరాజు నీలన్నకు టికెట్ రాకపోవడంపై ఆయన మద్దతుదారులు ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు.
♦ తిపటూరు ఎమ్మెల్యే షడక్షరీ అనుచరుడు ఒకరు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
♦ నెలమంగళ మాజీ ఎమ్మెల్యే అంజనమూర్తి మద్దతుదారులతోకలిసి నీలంబగల్ జాతీయ రహదారిపై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
♦ బాగల్‌కోటలో ఆర్‌బీ తిమ్మాపుర అనుచరులు టైర్లను కాల్చి నిరసన తెలిపారు.
♦ హానగల్ ఎమ్మెలే మనోహర్ తహసీల్దార్ కూడా ఆందోళనకు దిగారు.
♦ చిక్కమగళూరు టికెట్ ఆశించిన గాయత్రి శాంతిగౌడ అనుచరులతో కలిసి నిరసన తెలిపారు. టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
♦ జగళూరు టికెట్ ఆశించి భంగపడ్డ హెచ్‌బీ రాజేష్ కాంగ్రెస్ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దావణగెరెలోని మంత్రి ఎస్‌ఎస్ మల్లికార్జున నివాసం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.
♦ బాగేపల్లి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎం.మెహతాకు కూడా మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయన తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు.
♦ బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ఎదుట రాజాజీనగర, మహాలక్ష్మి లేఅవుట్ నియోజకవర్గాలకు చెందిన గిరీష్, మంజులానాయుడు ఆందోళనకు దిగారు. అదేవిధంగా దావణగెరె, బాగల్‌కోట ప్రాంతాల్లో కూడా అక్కడి కాంగ్రెస్ నాయకులు టికెట్ రాలేదని నిరసన తెలిపారు.
టికెట్లు రాని11 మంది సిట్టింగ్‌లు వీరే
బాదామి – చిమ్మనకట్టె; తిపటూరు – షడక్షరీ; కరికెరె – హెచ్‌జీ శ్రీనివాస్; మాయకొండ – శ్రీనివాసమూర్తి నాయక్; బ్యాడిగె – బసవరాజు నీలన్న శివన్నవర్; హానగల్ – మనోహర్ తహసీల్దార్; విజయపుర – ముకుల్ భగవంత్; జగలూరు – రాజేష్; సిరిగుప్ప – బీఎం నాగరాజు; కొల్లెగళ – జయన్న; కల్బుర్గి గ్రామీణ – బి.రామకృష్ణ
రెబల్‌గా పోటీ చేస్తాం
సీఎం సిద్ధరామయ్యతో కలిసి చర్చించాం. టికెట్ ఇస్తారనే ఆశ ఉంది. నియోజకవర్గం నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ టికెట్ రాకపోతే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగుతానని శిరిగుప్ప ఎమ్మెల్యే నాగరాజు, బాదామి ఎమ్మెల్యే చిమ్మనకట్టె తెలిపారు. ఎమ్మెల్యేలు బసవరాజు నీలన్న, శివన్నవర్, షడక్షరీ, శివమూర్తి తదితరులు కూడా తిరుగుబాటలో ఉన్నారు.