రామనాథపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విల్లు ఎక్కుపెడుతున్న ప్రధాని మోదీ
బెంగళూరు/సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికారం కోసం కలలు కంటున్న కాంగ్రెస్, దాని కూటమి పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘ఇప్పుడు న్యాయం జరుగుతుంది (అబ్ హోగా న్యాయ్) అనే నినాదంతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ.. గతంలో తన 60 ఏళ్ల పాలనలో అన్యాయం చేసిందని పరోక్షంగా అంగీకరించినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన కర్ణాటక రాజధాని బెంగళూరు, మంగళూరు, తమిళనాడులోని తేని, రామనాథపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. మంగళూరు పార్టీ నిర్వహించిన ‘విజయ్ సంకల్ప్’ ఎన్నికల సభలో మోదీ మాట్లాడారు. ‘ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చేటపుడు వేలాది జనం మానవహారంలా కాకుండా మానవ కుఢ్యం(హ్యూమన్ వాల్)గా నిల్చున్నారు.
జనమంతా రోడ్లపైనే ఉంటే అసలు వేదిక వద్ద జనం ఉన్నారా అని అనుకున్నా.. కానీ వేదిక వద్ద చూస్తే అంతకుమించిన జనం ఉన్నారుగా’ అని వేలాదిమంది కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్, దాని కూటమి పార్టీలను కనీసం డిపాజిట్లు కూడా దక్కని విధంగా ఓడించండి. తమ ప్రభుత్వం 60 రోజుల్లో ‘సులభతర వాణిజ్య విధానం’ అమల్లోకి తెస్తే కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో దోపిడీ విధానాన్ని అమలు చేసింది’ అని ఎద్దేవా చేశారు. ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులపై అధికార కాంగ్రెస్–జేడీఎస్ నేతల తీరును ఆయన ప్రస్తావిస్తూ.. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రి.. ఎవరి విషయంలోనైనా చట్టం తన పని తాను చేయాలా వద్దా? ఏ తప్పూ చేయనప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు.
ఎవరు న్యాయం చేస్తారు? : ‘ఇప్పుడు న్యాయం జరుగుతుంది(అబ్ హోగా న్యాయ్) అంటూ కాంగ్రెస్ అంటోంది. అంటే గతంలో ఆ పార్టీ 60 ఏళ్ల పాలనలో అన్యాయం జరిగినట్లు పరోక్షంగా అంగీకరించినట్లే కదా’ అని ‘న్యాయ్’ పథకంపై ప్రధాని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా..1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు ఎవరు న్యాయం చేస్తారు? దళితులపై దాడుల బాధితులకు ఎవరు న్యాయం చేస్తారు? కేవలం ఆ ఒక్క కుటుంబానికి నచ్చలేదనే కారణంతో అన్యాయంగా బర్తరఫ్‌నకు గురైన మహానేత ఎంజీ రామచంద్రన్ ప్రభుత్వానికి ఎవరు న్యాయం చేస్తారు? దేశంలో అతిపెద్ద భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు ఎవరు న్యాయం చేస్తారు? ఎంజీ రామచంద్రన్, ఎం.కరుణానిధి తదితరులకు చెందిన ప్రాంతీయ పార్టీలను, కమ్యూనిస్టులను అన్యాయంగా అణగదొక్కింది’ అని ప్రధాని మండిపడ్డారు.
వారితో ఉగ్రవాదానికి ఊతం
‘కాంగ్రెస్, ఆ పార్టీ కూటమి అధికారంలో ఉండగా దేశంలో తరచూ ఉగ్రదాడులు జరిగేవి. కాంగ్రెస్ పార్టీ మాత్రం వాటిని అపకుండా చూస్తూ ఉండిపోయింది. కాంగ్రెస్, డీఎంకే, ముస్లింలీగ్ కూటమికి ఓటేస్తే ఉగ్రవాదులు, నేరస్తులకు ఊతమిచ్చినట్లే’ అని పేర్కొన్నారు. ‘అవినీతి కుటుంబాల రాచరిక పాలనను అడ్డుకుని, శ్రీలంక తమిళుల సంక్షేమానికి పనిచేస్తాం’ అని తెలిపారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఆ కూటమిలోని నేతలే అంగీకరించలేదని మోదీ వ్యాఖ్యానించారు. కూటమి పార్టీల నేతలు ఎవరికివారు ప్రధాని పదవి కోసం క్యూకట్టి నిల్చుని ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఆ ఒక్క కుటుంబానికే ప్రాధాన్యం
బీజేపీ హిందుత్వను విమర్శించేందుకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ తమిళుల గౌరవం అంటూ మాట్లాడటంపై ప్రధాని స్పందిస్తూ.. ‘దివంగత ఎంజీఆర్, జయలలిత పేదల కోసం పరితపించిన గొప్పనేతలు. శబరిమల అయ్యప్ప ఆలయ వివాదంలో బీజేపీ ప్రజల పక్షాన నిలిచింది. కానీ, కేరళలోని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ముస్లిం లీగ్ పార్టీలు శబరిమల ఆలయం విషయంలో ప్రమాదకరమైన ఆటను ఆడుతున్నాయి. బీజేపీకి దేశమే మొదటి ప్రాధాన్యం కాగా ప్రతిపక్షానికి కుటుంబమే ముఖ్యం’ అని తెలిపారు. ‘ఆ ఒక్క కుటుంబం మినహా మరెవరూ దేశానికి సేవ చేయలేదన్నట్లుగా రాజధాని ఢిల్లీలో ఎక్కడ చూసినా వారి స్మారకాలే కనిపిస్తాయి. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి కలాం మెమోరియల్‌ను కాంగ్రెస్ నిర్మించలేదు. ఆ ఒక్క కుటుంబానికి చెందిన వారి పేర్లను ఇక్కడ ప్రభుత్వ భవనాలు, రహదారులకు పెట్టింది’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment