
నియోజకవర్గ ప్రజలు తనను కొడంగల్‌లో 30వేల మెజారిటీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు
సాక్షి, వికారాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్ నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఎండగట్టాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని డబ్బుతో కొనలేరని విమర్శించారు. కేసీఆర్ అక్రమాలను ప్రశ్నించినందుకే ప్రతిపక్షపార్టీల నాయకులపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. చింతమడక ఛీటర్ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. త్వరలో రాష్టంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనను కొడంగల్‌లో 30వేల మెజారిటీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి వల్ల లాభమే తప్ప నష్టం లేదన్నారు. అధికార పార్టీ నాయకులు డబ్బులతో ఓటర్లను కొనలేరని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్‌ఆర్‌కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం ఎలాగో తనకు కొడంగల్ నియోజకవర్గం అలాగేనని స్పష్టం చేశారు. తనకు 2009లో 7 వేల మెజారిటీ, 2014లో 15 వేలు వచ్చిందని గుర్తు చేశారు.
6 లేదా 7న కాంగ్రెస్ మేనిఫెస్టో
అభ్యర్థుల ప్రకటనకు ముందే పార్టీ మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా తుది మెరుగులు దిద్దుతోంది. ఈ నెల 6 లేదా 7న మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ గత నెల రోజులుగా 2 వేలకుపైగా వినతులు స్వీకరించింది. వాటిని 36 విభాగాలుగా విభజించిన సబ్ కమిటీల సభ్యులు ఇప్పటికే 130 పేజీల నివేదికను దామోదరకు అందజేశారు. అందులో ఇప్పటికే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అంశంతోపాటు లక్ష ఉద్యోగాలు, పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, చేనేతకు రుణాలు, మహిళా సంఘాలకు ఆర్ధిక చేయూత వంటి అంశాలను చేర్చారు. వాటితోపాటే కొత్తగా మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పింఛన్ల అంశం, ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక పంపిణీ, బీపీఎల్ కుటుంబాలకు సైతం వంద యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అంశాలపై ప్రస్తుతం కమిటీ సభ్యులు చర్చలు జరుపుతున్నారు.