
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ భారత ప్రజల వాణి (వాయిస్ ఆఫ్ ఇండియా) అని, దేశ వర్తమానం, భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించాల్సిన అవసరముందని రాహుల్‌గాంధీ ఈ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేస్తూ పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు అండగా పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
రాహుల్ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఆయన అధ్యక్షతన జరుగుతున్న తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇది. వారం కిందట కొత్త సీడబ్ల్యూసీ ఏర్పాటైన విషయం తెలిసిందే. 23 మంది సభ్యులతో ఏర్పాటైన సీడబ్ల్యూసీ దృష్టంతా ప్రస్తుతం ఎన్నికల సన్నద్ధతపైనే ఉంది. ఈ ఏడాది చివర్లో మూడు రాష్ట్రాలతోపాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఎజెండాను, వ్యూహాన్ని ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. రాహుల్ నాయకత్వంలో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేసి రానున్న ఎన్నికలను ఎదుర్కోవాలని సీడబ్ల్యూసీ భావిస్తోంది.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ ప్రయత్నం మేం రాహుల్‌గాంధీకి అండగా ఉంటా. భారత ప్రజాస్వామిక విలువలను దెబ్బతీస్తున్న ఈ ప్రమాదకరమైన పరిపాలన నుంచి మన ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని సమర్ధంగా ఎదుర్కొనేందుకు సంకీర్ణ రాజకీయాలు, ప్రాంతీయ, ఉపప్రాంతీయ పార్టీలతో అవగాహన వంటి కీలక బాధ్యతలు రాహుల్ భుజాన వేసుకున్నారు. ప్రస్తుత సీడబ్ల్యూసీలో సోనియా, మన్మోహన్, ఆజాద్, మోతీలాల్ వోరా, ఖర్గే, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment