
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరిలో కాంగ్రెస్ పార్టీకి నూతన సారథిని ఎన్నుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సదస్సు ఏర్పాటు చేసిన అనంతరం అధ్యక్ష ఎన్నిక జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా సీనియర్ నేతల లేఖతో పార్టీలో విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతూ, సంస్థను బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు తీసుకురావాలని సోనియాగాంధీని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. (‘చదవండి: మనసు నొప్పించి ఉంటే క్షమించండి’)
ఇందుకు ఆమె సమ్మతించడంతో అసమ్మతి నేతల తిరుగుబాటు తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించేలా లేఖ ఉందన్న ఎంపీ రాహుల్ గాంధీ.. ఇందులో బీజేపీ హస్తం ఉందంటూ సీనియర్ నేతలపై మండిపడిన నేపథ్యంలో వారు సైతం ఇందుకు దీటుగానే బదులిచ్చారు. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలు అందించిన తమను ఇలా కించపరచడం సరికాదని హితవు పలికారు. ఈ సందర్భంగా తాత్కాలిక చీఫ్‌గా సోనియాను కొనసాగిస్తూనే.. సాధ్యమైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. (చదవండి: పార్టీ కోసమే మా లేఖాస్త్రం )
ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి!
కానీ రాహుల్ సహా గాంధీ కుటుంబ విధేయులు ఆర్నెళ్లపాటు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో.. జనవరిలో ఏఐసీసీ సదస్సు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క బిహార్ అసెంబ్లీకి తప్ప, ఈ ఏడాది మరే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోవడం.... తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి తదితర ఐదు రాష్ట్రాలకు 2021 ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ ఆరు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త సారథి నేతృత్వంలో ఓ పర్‌ఫెక్ట్ టీంను తయారు చేసుకుని, ముందుకు సాగే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇక నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసిన 23 మంది సీనియర్ నాయకుల్లో పలువురు తమ ఉద్దేశం గురించి వివరణ ఇస్తూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాము అసమ్మతివాదులం కాదని, పార్టీ పునరుత్తేజాన్ని కోరుకుంటున్న వాళ్లమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అదే విధంగా సోనియా గాంధీ నాయకత్వాన్ని తాము సవాలు చేయలేదని, అధ్యక్ష పదవిలో ఆమె కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా.. సీనియర్ నేత వీరప్ప మొయిలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లే స్థితిలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే స్థితిలో ప్రస్తుతం పార్టీ లేదన్నది అంగీకరించిన వాస్తవమని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు, దేశంలో జరగనున్న ఇతర ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం కోసమే తాము రాసిన లేఖ రాశామని, ఈ విషయం సోనియా మనసును గాయపరిచి ఉంటే ఆమె క్షమాపణ చెబుతున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment