
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ పదవికే వన్నె తెచ్చిన తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌పై కాంగ్రెస్ నీచ రాజకీయం చేస్తోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్రంలో జరిగే ప్రతి పనిని వ్యతిరేకించి అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ ప్రధాన విధిగా పెట్టుకుందని మండిపడ్డారు.
గవర్నర్ పదవిని రబ్బర్ స్టాంప్‌గా మార్చి, రాజ్‌భవన్‌లను తమ రాజకీయాలకు అడ్డాగా మార్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని క్షేత్ర స్థాయిలో గవర్నర్ పరిశీలిస్తున్నారని తెలిపారు. గవర్నర్ల వ్యవస్థ గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. గవర్నర్లను తమ ఏజెంట్లుగా మార్చుకొని గిట్టని ప్రభుత్వాలను బర్తరఫ్ చేయించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు.