నర్సయ్యగౌడ్, కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక సమయం దగ్గరపడినా ఆ పార్టీలో అసంతృప్తి సద్దుమణగడం లేదు. ఉపఎన్నిక సంకేతాలు వెలువడింది మొదలుకుని కూసుకుంట్లకు టికెట్ ఇవ్వొద్దంటూ గళం విప్పిన నేతలు నామినేషన్ల స్వీకరణ మొదలైనా పట్టు వీడటం లేదు.
కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని రెండు రోజుల క్రితం ప్రకటించారు. కానీ నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు ఇంకా పట్టు వీడటం లేదు. ఈ నేపథ్యంలో మునుగోడుకు చెందిన అసంతృప్త నేతలతో శనివారం ప్రగతిభవన్‌లో కీలక భేటీ జరిగింది.
కేటీఆర్, హరీశ్‌రావులతో భేటీ
మునుగోడు నియోజకవర్గానికి చెందిన పార్టీ అసంతృప్త నేతలను వెంట బెట్టుకుని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ శనివారం ప్రగతిభవన్‌కు వచ్చారు. నారాయణపూర్ ఎంపీపీ, మునుగోడు వైస్ ఎంపీపీ, పలువురు సర్పంచులు సహా సుమారు 70 మంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులతో భేటీ అయ్యారు. గతంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తమను ఇబ్బంది పెట్టిన తీరును ఏకరువు పెట్టారు.
తమపై కేసులు నమోదు చేయించడం, ఆర్థికంగా దెబ్బతీయడం వంటివీ చేశారని వివరించారు. ఉప ఎన్నిక వాతావరణం ప్రారంభమైనా తమకు పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీల నుంచి చేరికలకు ఒత్తిడి, ప్రలోభాలు వస్తున్నా టీఆర్‌ఎస్‌పై అభిమానంతో కొనసాగుతున్నామని.. పార్టీ ఇన్‌చార్జులుగా నియమితులైన నేతలు కూడా తమను సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తాం
మునుగోడు టీఆర్‌ఎస్ అసంతృప్త నేతల అభిప్రాయాలు విన్న కేటీఆర్, హరీశ్‌రావు రెండు, మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అసంతృప్త నేతలను కలుపుకొని వెళ్లాలని ప్రస్తుతం యూనిట్ ఇన్‌చార్జీ్జలుగా నియమితులైన నేతలకు సూచించినట్టు సమాచారం. అయితే అసంతృప్త నేతలు కేటీఆర్, హరీశ్‌లతో జరిగిన భేటీపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే.. తమ ఇబ్బందులను పరిష్కరించకపోతే సొంత దారి చూసుకుంటామనే సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment