ర్యాలీగా వెళ్తున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు
సాక్షి, అనంతపురం(తాడిపత్రి) : గత ఐదేళ్ళ టీడీపీ ప్రభుత్వ పాలనలో జేసీ సోదరులు పేదవారి గృహాలను కూడా వదలకుండా బినామీల పేర్ల మీద దోచుకొని దాచుకున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్ ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ జేసీ సోదరులు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన ఇంట్లో పనిచేస్తున్న గుమస్తాల పేరు మీద భూములు కొనుగోలు చేసి అక్రమ మైనింగ్‌లకు పాల్పడి కోట్లాది రూపాయాలు ఆర్జించారని.. నిజమైన పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని విమర్శించారు. జేసీ సోదరుల హయాంలో ఇందిరమ్మ గృహాల పేరిట పేదలను మోసం చేశారని, గృహాలను మంజూరు చేస్తామని ఒక్కొక్కరితో రూ.2 వేలు వసూలు చేసి కేవలం అనుచరులకు మాత్రమే 300 పక్కా గృహాలు మంజూరు చేశారని ఆరోపించారు. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమైనా అర్హులైన పేదలకు పక్కా గృహాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ అధికారులకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, సహాయ కార్యదర్శి వెంకట్రాముడు యాదవ్, పట్టణ కార్యదర్శి చిరంజీవియాదవ్, సహాయ కార్యదర్శి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment