
సాక్షి, హైదరాబాద్: ‘మహా కూటమిలో చేరతామన్నందుకు.. సీపీఐకి రెండు, మూడు సీట్లా? అక్కర్లేదు. వారి ప్రతిపాదనకు ఒప్పుకుంటే.. అది పార్టీకి ఆత్మహత్యా సదృశమే. అవసరమనుకుంటే సొంతంగానే పోటీ చేద్దాం’ అని సీపీఐ తెలంగాణ నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం మగ్దూం భవన్‌లో అత్యవసరంగా భేటీ అయింది. ఈ సందర్భంగా మహాకూటమిలో.. సీపీఐకి 2–3 సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రతిపాదనపై సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత తక్కువ సీట్లు ఆఫర్ చేస్తే తిరస్కరించాలని మెజార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. అవసరమైతే ఒంటరిగానే పోటీ చేయాలని సూచించారు. దీంతో ముఖ్యనేతలకు ఏం చేయాలో అర్థంగాని పరిస్థితి ఎదురైంది.
కూనంనేని సాంబశిరావు అయితే సమావేశం మధ్యలోనుంచే అలిగి వెళ్లిపోయినట్లు సమాచారం. కాగా, కార్యవర్గంలోని సభ్యుల డిమాండ్‌తో సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, చాడ వెంకటరెడ్డి కూడా ఏకీభవించారు. కాగా, తానేమీ అలిగి వెళ్లిపోలేదని సాంబశివరావు స్పష్టం చేశారు. అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీట్ల కేటాయింపు విషయంలో అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోమన్నారు. కాంగ్రెస్ ఇస్తానంటున్న రెండు, మూడు సీట్లకు అంగీకరిస్తే.. అది పార్టీకి ఆత్మహత్య లాంటిదేనన్నారు. అంతటి దారుణమైన స్థితిని పార్టీకి కల్పించబోమన్నారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేసేం దుకూ వెనుకాడబోమన్నారు.
రాఫెల్ వివాదంపై జాతీయ వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఈనెల 24న ఢిల్లీలో సమావేశం కానున్నట్లు సురవరం వెల్లడించారు. సైకిల్ కూడా తయారు చేయలేని అనిల్ అంబానీకి యుద్ధ విమానాల తయారీని ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పొత్తులపై ఇప్పటివరకు ఏ పార్టీతోనూ అవగాహన కుదరలేదన్నారు. సీట్ల సర్దుబాటు విషయా న్ని కాంగ్రెస్ పార్టీ తొందరగా తేల్చాలని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘మాకు 9 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌కు తెలిపాం. మహా కూటమితోనే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి.. అందులో ఒకటో, రెండో సీట్లు తగ్గిస్తే పర్వాలేదు. కానీ అంతకన్నా ఎక్కువగా తగ్గిస్తామంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం. దీనిపై మరోసారి కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తాం’ అని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment