టీటీడీపీ భేటీ అనంతరం మీడియాతో మోత్కుపల్లి, సంలచనాత్మక ‘ఓటుకు కోట్లు’ దృశ్యాలు.
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదే పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి పార్టీలోకి అడుగుపెట్టిన నాటి నుంచే టీడీపీ దెబ్బతింటూ వచ్చిందని, సంచలనాత్మక ‘ఓటుకు కోట్లు’ కేసు బాధ్యుడు కూడా రేవంత్ రెడ్డేనని నర్సింహులు ఆరోపించారు. టీటీడీపీ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఓటుకు కోట్లు’ బాధ్యుడు అతనే : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో బాధ్యుడు ‘ఎవరో’ కాదని, రేవంత్‌రెడ్డేనని మోత్కుపల్లి చెప్పారు. ‘‘రేవంత్ అడుగుపెట్టిన నాటి నుంచి టీడీపీ బలహీన పడింది. ఎకాఎకి ముఖ్యమంత్రి కావాలనేది ఆయన ఆలోచన. ఆ దూకుడు భరించలేకే ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్లు పార్టీ నుంచి వెళ్లిపోయారు. తన సొంత లబ్ధికోసం పార్టీని భ్రష్టుపట్టించేవాళ్లను చూస్తూ ఊరుకోబోం’’ అని నర్సింహులు వ్యాఖ్యానించారు.
యనమల, పరిటాలను తిట్టే హక్కు ఎవడిచ్చాడు? : ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీతలకు తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులతో ఆర్థిక సంబంధాలున్నాయంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మోత్కుపల్లి ఫైరయ్యారు. ‘యనమల, పరిటాలను తిట్టే హక్కు రేవంత్‌కు ఎవరిచ్చారు?’ అని ప్రశ్నించారు. యనమల దగ్గరి బంధువుకు రూ.2వేల కోట్ల కాంట్రాక్టు. పరిటాల సునీతకు బీర్ ఫ్యాక్టరీ ఏర్పాటులో సీఎం కేసీఆర్ సహకరించారని రేవంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబును అడిగే రాహుల్‌ని కలిశాడా? : ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి.. అక్కడ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారన్న వార్తలపై మోత్కుపల్లి స్పందిస్తూ.. ‘మేం ఏది అడిగినా చంద్రబాబుతోనే మాట్లాడుతానని రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పిండు. ఏం, చంద్రబాబును అడిగే ఆయన రాహుల్ గాంధీని కలిసిండా? ఢిల్లీలో ఎవరెవరితోనో మాట్లాడి, ఇక్కడికొచ్చి మా పార్టీకే చెందిన ఏపీ మంత్రులపై విమర్శలు చేస్తడా? అందుకే, సమాధానం చెప్పమని గట్టిగా అడిగాం’’ అని మోత్కుపల్లి వివరించారు.
టీఆర్‌ఎస్‌తో పొత్తు ఆలోచన ఎవరిది? : టీడీపీలో ప్రస్తుత సంక్షోభానికి అసలు కారణమైన ‘టీఆర్‌ఎస్‌తో పొత్తు’ పైనా మోత్కుపల్లి స్పందించారు. ‘‘అసలు టీఆర్‌ఎస్‌తో టీడీపీ పొత్తు పెత్తుకుంటుందని నేనేదో అన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ మొదట పొత్తు మాటెత్తింది నేను కాదు రేవంతే. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ- బీజేపీ అలయెన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ కలిస్తే గిలిస్తే, టీఆర్‌ఎస్‌తో కలిసే అవకాశం ఉంటుందన్నాను. రేవంత్ తన లబ్ధికోసం ప్రార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడు’’ అని నర్సింహులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment