శుక్రవారం రాజ్యసభలో విపక్ష సభ్యుల గొడవ దృశ్యం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజే వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ‘పాకిస్తాన్‌తో కలిసి కుట్ర’ చేశారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై చేసిన ఆరోపణ లకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు రాజ్యసభను స్తంభింపచేశాయి. సభ సాధారణ కార్యకలాపాలను రద్దుచేసి ప్రధాని చేసిన ఆరోపణలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా.. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరిం చారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది. రాజ్యసభ మొత్తం మూడు సార్లు వాయిదాపడగా.. సాయంత్రం 3 గంటల సమయంలో ప్రతిపక్షాల నిరసనల మధ్య సభను రోజంతటికీ వాయిదా వేశారు. ఇటీవల మృతిచెందిన ప్రస్తుత సభ్యులు, మాజీ సభ్యులకు నివాళులర్పించాక ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే లోక్‌సభ వాయిదా పడింది.
రాజ్యసభలో..
ప్రశ్నోత్తరాలకోసం సభ మధ్యాహ్నం సమావే శం కాగానే.. మన్మోహన్‌పై మోదీ ఆరోపణల్ని ప్రతిపక్ష నేత ఆజాద్ లేవనెత్తారు. ఈ అంశం తీవ్రమైనదని, సభా కార్యకలాపాల్ని రద్దు చేసి తామిచ్చిన నోటీసుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ‘మాజీ ప్రధాని, మాజీ ఉప రాష్ట్రపతిపై ఆరోపణలు చేశారు. పాక్‌తో కలిసి కుట్ర చేశారని పలువురు విదేశీ కార్యదర్శులు, హై కమిషనర్లు, రాయబారులపై గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించారు. దీంతో విపక్షాలు ఆందోళనకు దిగడంతో గందరగోళం మధ్య సభను చైర్మన్ 2.30 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్షాల నిరసనల మధ్య ఆజాద్ మళ్లీ ఈ అంశాన్ని లేవనెత్తారు. అనంతరం సభను కురియన్ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సమావేశమయ్యాక ప్రధాని క్షమాపణకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఆందోళనను కొనసాగించడంతో సభ రోజంతటికీ వాయిదా పడింది.
శరద్, అన్వర్‌ల అనర్హతపై నిరసన
ఉదయం రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికి.. జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్, ఆ పార్టీ నేత అలీ అన్వర్‌ల్ని రాజ్యసభ సభ్యులుగా అనర్హులుగా ప్రకటిస్తూ చైర్మన్ వెంకయ్య ప్రకటన చేశారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేయగా.. అధికార పక్ష సభ్యులు అదే స్థాయిలో నినాదాలు చేశారు. చైర్మన్ నిర్ణయంపై ఎలాంటి చర్చకు అనుమతించనని సభాపతి స్పష్టం చేశారు. ‘రెండు వైపులా సభ్యులు నిలబడి ఉన్నారు. ఇది పద్దతి కాదు. మొదటి రోజు ఇలా జరగడాన్ని మీరు కోరుకుంటున్నారా? వెల్‌లోకి దూసుకొచ్చే ప్రవర్తనను నేను ఒప్పుకోను’ అని ఒక దశలో చైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక లోక్‌సభలో ఇటీవల మరణించిన ప్రస్తుత సభ్యులు, మాజీ సభ్యుల మృతికి సంతాపం అనంతరం సభ సోమవారానికి వాయిదాపడింది.
‘ఐ బెగ్’ వాడకండి: వెంకయ్య
శీతాకాల సమావేశాల తొలి రోజు రాజ్యసభనుద్దేశించి వెంకయ్య ప్రసంగించారు. మనది స్వతంత్ర దేశమని, ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి మాటలను సభలో వాడుతున్నారని, వాటిని మానేయాలని మంత్రులు, సభ్యులను కోరారు. సభ్యులు తాము ప్రస్తావించదలచుకున్న అంశాలను వివరించే క్రమంలో ఆర్థించు అనే అర్థం వచ్చేలా ఉన్న( ఐ బెగ్ టు) మాటను ఉపయోగించవద్దని కోరారు. ఇది పరాయి పాలనను స్ఫురణకు తెస్తోందన్నారు. సభ్యులు ఆర్థించు బదులుగా ‘నేను ఈ రోజు ప్రస్తావించదలచిన అంశాలివి’ అని మాత్రం చెబితే చాలని వివరించారు.
తొలిసారిగా పార్లమెంట్‌కు అమిత్ షా
బీజేపీ అధ్యక్షుడు అమిత్ తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఆగస్టులో రాజ్యసభకు ఎన్నికైన ఆయన శీతాకాల సమావేశాల తొలిరోజు సభకు హాజరై అధికార పక్షం వైపు తొలి వరుసలో కూర్చున్నారు.
సమావేశాలు ఫలవంతంగా సాగుతాయి: ప్రధాని
నిర్మాణాత్మక చర్చలు, సరికొత్త ఆలోచనలతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. సమావేశాలు ఫలవంతం అవుతాయని నమ్మకముంది. చర్చతో పాటు, దేశ సమస్యలకు కొత్త పరిష్కారాలు దొరుకుతాయని ఆశిస్తున్నాను’ అని చెప్పారు.
రాజ్యసభలో అమిత్ షా, నడ్డా, జవదేకర్ తదితరులు
Comments
Please login to add a commentAdd a comment