
అలెగ్జాండ్రా ఒకాషియో కార్ట్జ్
న్యూయార్క్ : వెయిటర్ నుంచి డెమొక్రాట్ విజేత స్థాయికి ఎదిగిన అలెగ్జాండ్రా ఒకాషియో కార్ట్జ్ ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అమెరికా ప్రతినిధుల సభకి గతంలో పదిసార్లు ఎంపికైన జోసెఫ్ క్రౌలీపై న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు సోషలిస్టు భావాలు కలిగిన 28 ఏళ్ళ ఒకాషియో కార్ట్జ్ ఇటీవలి అమెరికా రాజకీయాల్లో ఈమె విజయం అమెరికా ప్రజలను షాక్‌కి గురి చేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఒకాషియో విజయంపై స్పందిస్తూ ఇది జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదని ట్వీట్ చేశారు. ఒకాషియో తల్లిది ప్యూయెర్టో రికో, తండ్రి సౌత్ బ్రాంగ్స్‌కి చెందిన వారు. రాజకీయాల్లోకి అనూహ్యంగా అడుగుపెట్టిన అలెగ్జాండ్రా ఒకాషియో కార్ట్జ్ బార్లలో వెయిటర్‌గానూ, గర్భవతులకు సహాయకారిగానూ, టీచర్‌గానూ బతుకుదెరువు కోసం వివిధ వృత్తులు నిర్వహించారు.
ఒకాషియో 2016 అధ్యక్ష ఎన్నికల్లో సైతం సోషలిస్ట్ అయిన బెర్నీ సాండర్స్‌కి వాలంటీర్‌గా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధిస్తే కాబోయే స్పీకర్ ఒకాషియో అవుతారని ఆమెపై ఓడిపోయిన క్రౌలీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఒకాషియో స్ఫూర్తితో పనిచేయాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు.
తనని తాను న్యూయార్క్ శ్రామిక వర్గ ప్రతినిధిగా, కార్యకర్తగా, ఎడ్యుకేటర్‌గా చెప్పుకునే ఒకాషియో ప్రైమరీ ఎన్నికల్లో కార్మికుల సామాజిక, ఆర్థిక విషయాలపైనా, కనీస వేతనాల్లాంటి అంశాలపై కేంద్రీకరించారు. ట్రంప్ జీరో టాలరెన్స్ కఠోర వలస విధానాలను ఎండగట్టారు. అదే డెమొక్రాట్లను విశేషంగా ఆకర్షించి ఆమెను భవిష్యత్ ఎన్నికల్లో అభ్యర్థిగా ఎంపిక చేసింది.