సాక్షి, వైఎస్సార్ కడప: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 8నెలల్లోనే అనేక హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి లబ్ధిదారులకు పథకాల అమలుకు వాలంటీర్ల వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇప్పటి వరకు 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. నవత్నాల పథకాల అమలు లక్ష్యమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని సాహసోపేత నిర్ణయాలు సీఎం జగన్ తీసుకున్నారన్నారు. కేవలం మాటలకే గత ప్రభుత్వాలు పరిమితం అయ్యాయని, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి సీఎం కంకణం కట్టుకున్నారన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలు సాకులు వెత్తుకుంటున్నాయని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రజా చైతన్య యాత్రపై ప్రజలకు స్పష్టం చేయాలన్నారు.
చంద్రబాబు తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ దొంగ యాత్రలు చేస్తున్నారని బాషా విమర్శించారు. బినామీలను కాపాడటానికి మాత్రమే టీడీపీ యాత్రలు చేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చేసిన ప్రతి అవినీతిపై పక్కా విచారణ జరుగుతుందని, కొద్దీ రోజుల్లో అవినీతి కేసుల్లో చంద్రబాబు జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. ఒక ప్రాంతానికి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరిస్తూన్నారని, మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. రాజధాని పేరుతో చంద్రబాబు, లోకేష్ బినామీలు లక్షల ఎకరాల భూములు కొనుగోలు చేశారని, దాదాపు 40 వేల కోట్ల రూపాయల భారీ స్కాంకు టీడీపీ నేతలు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రైతుల భూములను బలవంతంగా అప్పటి పాలకులు లాక్కున్నారని, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తమ ప్రభుత్వంపై మోపారని అంజాద్ బాషా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment