![Devendra Fadnavis Slams Sena Politicisation Of Bandra Gathering - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/15/Devendra-Fadnavis.jpg.webp?itok=afxeHiCX)
ముంబై: వలస కార్మికులను ఆదుకోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం వలస కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంపై స్పందిస్తూ.. ‘చాలా తీవ్రమైన సంఘటన’గా పేర్కొన్నారు. దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
వలస కార్మికుల వెతలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని వ్యాఖ్యానించిన మంత్రి ఆదిత్య ఠాక్రేకు పరోక్షంగా ఫడ్నవీస్ చురకలంటించారు. కోవిడ్-19పై చేస్తున్నది రాజకీయ పోరాటం కాదన్న విషయం తెలుసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారిపై సమరంలో సీరియస్‌నెస్ చూపాలని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వానికి హితవు పలికారు.
కాగా, లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో మంగళవారం వేలాది కార్మికులు బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వినయ్ దూబే అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వలస కార్మికులను రెచ్చగొట్టినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment