
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ఎటువంటి దర్యాప్తు చేయకుండానే డీజీపీ ఠాకూర్ ఇది ప్రచారం కోసం చేసిన దాడి అంటూ తేల్చేయడాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తప్పుపట్టారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అని చెబుతూనే.. మరో పక్క కత్తితో దాడి చేశాడని డీజీపీ చెబుతున్నారని, ఎక్కడైనా కత్తితో దాడి చేసిన వ్యక్తి అభిమాని అవుతాడా అని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. డీజీపీ ఎవరి ఒత్తిడితో ఇలా మాట్లాడుతున్నారో చెప్పాలని అంబటి అన్నారు. పోలీసు బాసే ఇది ప్రచారం కోసం జరిగిందని చెప్పిన నేపథ్యంలో విచారణ సక్రమంగా జరుగుతుందని నమ్మకం లేదని, ఈ దర్యాప్తు నుంచి ఆయన్ని తప్పించాలని డిమాండ్ చేశారు.
హత్యాయత్నం వెనుక భారీ కుట్ర ఉన్నట్లుగా ప్రజలు అనుమాన పడుతున్నారన్నారు. దాడికి పాల్పడ్డ నిందితుడు శ్రీనివాస్ పనిచేస్తున్న క్యాంటీన్ యజమాని తొట్టెంపూడి హర్షవర్ధన్ టీడీపీ నేత అనే విషయం అందరికీ తెలుసన్నారు. ఈ ఘటనతో మాకు సంబంధం లేదంటూ సీఎం చంద్రబాబు, మంత్రులు ఎందుకు ఉల్కిపడ్డారని..ఘటన వెనుక చంద్రబాబు, మంత్రులు ఉన్నారని తాము చెప్పలేదు కదా అని అన్నారు. వారు చెప్పినట్లే ఎయిర్‌పోర్టు కేంద్రం ఆధీనంలో ఉంటే ప్రత్యేక హోదా కోసం క్యాండిల్ ర్యాలీ చేయడానికి విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన జగన్‌మోహన్ రెడ్డిని ఎయిర్‌పోర్టు రన్‌వేపైనే రాష్ట్ర పోలీసులు ఎలా అడ్డుకున్నారంటూ అంబటి ప్రశ్నించారు. సినీ నటుడు శివాజీ చెప్పినట్లుగానే ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగిందని ప్రభుత్వం చెబుతుండటంతో ముందుగా శివాజీని అరెస్టు చేసి విచారణ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment