న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అత్యంత పోటీ ఉండే లోక్‌సభ స్థానం (టఫెస్ట్ సీటు) నుంచి పోటీ చేయాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ విసిరిన చాలెంజ్‌ను దిగ్విజయ్ సింగ్ నాలుగు రోజుల కిందట స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను భోపాల్ నుంచి కాంగ్రెస్ బరిలోకి దింపింది. గట్టి పోటీ ఉండే స్థానం నుంచి పోటీ చేయాలన్న తన సవాలును దిగ్విజయ్ స్వీకరించడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సీఎం కమల్‌నాథ్ శనివారం విలేకరులకు తెలిపారు. ‘చాలెంజ్‌లు స్వీకరించడం నా అలవాటు. 1977లో జనతా పార్టీ ప్రభంజనం వీచినప్పటికీ.. రాంగఢ్ నియోజకవర్గం నుంచి నేను గెలుపొందాను. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన స్థానంలో పోటీకి సిద్ధంగా ఉన్నాను’ అని దిగ్విజయ్ ట్విటర్‌లో తెలిపారు.
భోపాల్ మధ్యప్రదేశ్‌లో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అలోక్ సంజార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భోపాల్‌తోపాటు ఇండోర్, విదిశా నియోజకవర్గాల్లో గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో భోపాల్‌లో కాంగ్రెస్ నుంచి మాజీ రాష్ట్రపతి దివంగత శంకర్ దయాల్ శర్మ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో భోపాల్ నుంచి దిగ్విజయ్‌ను కమల్‌నాథ్ బరిలోకి దింపుతున్నారు. కమల్‌నాథ్ సీఎం పదవి చేపట్టిన తర్వాత దిగ్విజయ్‌తో ఆయనకు విభేదాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు రానున్న ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment