‘ఏదో ఓ రోజు అందరం చావాల్సిందే’ | DK Shivakumar Says No point We Will All Die | Sakshi
Sakshi News home page

తొలిసారి అసహనం వ్యక్తం చేసిన ట్రబుల్‌షూటర్‌

Published Tue, Jul 23 2019 3:56 PM | Last Updated on Tue, Jul 23 2019 4:21 PM

DK Shivakumar Says No point We Will All Die - Sakshi

బెంగళూరు: కన్నడ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై మంగళవారం తనకు వివరణ ఇవ్వాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ఆదేశించగా, అందుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెబెల్స్‌ని బుజ్జగించడానికి రంగంలోకి దిగిన ట్రబుల్‌షూటర్‌ డీకే శివకుమార్‌ తొలిసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం కూడా విశ్వాసపరీక్ష పూర్తయ్యేలా కనిపించకపోవడంతో శివకుమార్‌ అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శివకుమార్‌ బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. ‘నేను ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా ఆపలేకతున్నానని భావిస్తున్నారా.. ప్రస్తుతం మీ పక్కన చేరిన ఎంటీబీ నాగరాజుకు టికెట్‌ ఇప్పించిందే నేనే. ఆ విషయం మర్చిపోకండి’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శివకుమార్‌ వేదాంత ధోరణిలో మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు వెన్నుపోటు పొడిచిన నా మిత్రులు.. రేపు బీజేపీకి కూడా వెన్నుపోటు పొడుస్తారు. ఏదో ఓ రోజు మనమంతా చావాల్సిన వాళ్లమే కదా. మధ్యలో వచ్చే ఈ టెన్షన్స్‌ను తట్టుకోవడానికి మహా అయితే రాత్రికి రెండు పెగ్గులు వేసి పడుకుంటాను అంతే. ఇంకేం చేస్తాను’ అన్నారు.

రెబెల్‌ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు శివకుమార్‌ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ఇద్దరు రెబెల్‌ ఎమ్మెల్యేలు తమను కలవాల్సిందిగా నన్ను కోరారు. దాంతో నేను, కుమార స్వామి ముంబై వెళ్దామని భావించాం. కానీ అధికారులు సీఎం ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదన్నారు. దాంతో నేను, మరి కొందరితో కలిసి ముంబై వెళ్లాను. రెబెల్‌ ఎమ్మెల్యేలున్న హోటల్‌లోనే ఓ గది బుక్‌ చేశాను. కానీ నన్ను హోటల్‌లోకి అనుమతించలేదు. కనీసం స్నానం కూడా చేయకుండా ఆదరాబాదరా ముంబై వెళ్లాను. కానీ ఎమ్మెల్యేలు నన్ను కలవలేదు. పైగా వారంతా నా మీద కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా చూసి నేను షాక్‌ అయ్యాను’ అన్నారు.

‘ఈ ఎమ్మెల్యేలంతా లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా నాతో కలిసి పని చేశారు. నా అడుగుజాడల్లోనే నడుస్తామన్నారు. కానీ చివరకిలా చేశారు. ఓ 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ ఛాంబర్‌లో కూర్చోవడం చూశాను. అప్పుడే అక్కడికి వెళ్లి వారి రాజీనామాలను చింపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ అలా చేయలేకపోయాను’ అని వాపోయారు శివకుమార్‌.

అయితే ఏదేమైనా ఇవాళ బలపరీక్ష నిర్వహిస్తానని స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటలకల్లా చర్చ ముగించాలని స్పీకర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీకి వచ్చిన సీఎం కుమార స్వామి తన ఛాంబర్‌లోనే ఉన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎంకు మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement