చంద్రబాబు ఫొటోతో హర్షవర్ధన్ చౌదరి ఫేస్‌బుక్ ప్రొఫైల్ చిత్రం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో అధికార తెలుగుదేశం పార్టీ నేత, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని టి.హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి పాత్రను నిగ్గుతేల్చడంపై పోలీసులు చేతులెత్తేశారు. ఆ రెస్టారెంట్ కేంద్రంగానే జగన్‌పై హత్యాయత్నానికి కుట్ర జరిగిందన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాము హర్షవర్దన్ చౌదరి జోలికి వెళ్లలేమని, ఆ మేరకు తమకు పైస్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని విశాఖ పోలీసులు పేర్కొంటున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచే ఆదేశాలు అందాయని అంటున్నారు. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే యువకుడు అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. పోలీసులు ఇప్పటివరకు ఈ కేసు విచారణను కేవలం నిందితుడు శ్రీనివాసరావుకే పరిమితం చేశారు. జ్యుడీషియల్ కస్టడీ నుంచి ఆరు రోజులపాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పటికీ ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పక్కా స్క్రీన్‌ప్లేతో విచారణ డ్రామాను రక్తి కట్టించారు.
హర్షవర్దన్ చౌదరిని ప్రశ్నించని పోలీసులు
ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో నిందితుడు శ్రీనివాసరావు సహోద్యోగులైన యువతీ యువకులను ఆరు రోజుల విచారణ సమయంలో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలీసు స్టేషన్‌లోనే ఉంచేవారు. ఓ దశలో స్టేషన్ వద్దనే పడిగాపులు కాస్తున్న మీడియా సిబ్బంది... ఆడపిల్లలను ఇప్పటివరకు స్టేషన్‌లో ఉంచితే ఎలా? అని ప్రశ్నిస్తే పోలీసులు హడావుడిగా ఆటోలు తెప్పించి పంపించిన సందర్భాలు ఉన్నాయి. శ్రీనివాసరావు సహోద్యోగులను అర్ధరాత్రి దాకా స్టేషన్‌లోనే ఉంచి, విచారణ డ్రామాను నడిపించిన పోలీసులు ఆ రెస్టారెంట్ యజమాని, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ల సన్నిహితుడైన హర్షవర్దన్ చౌదరిని కనీసం ప్రశ్నించే సాహసం కూడా చేయలేకపోయారు. స్టేషన్‌లో ఉన్న తన రెస్టారెంట్ సిబ్బందిని తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడల్లా హర్షవర్దన్ చౌదరి పోలీస్ స్టేషన్‌లో దర్జాగా తిరుగుతూ కనిపించేవాడు. పోలీసులంటే తనకు ఓ లెక్క కాదన్నట్లుగా ప్రవర్తించేవాడు. తన వాహనాన్ని పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలోనే నో పార్కింగ్ బోర్డు వద్ద పార్క్ చేసేవాడంటే అతడి వ్యవహార శైలి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
విశాఖ ఎయిర్‌పోర్టులో నో పార్కింగ్ బోర్డ్ వద్ద హర్షవర్దన్ చౌదరి కారు పార్క్ చేసిన దృశ్యం.. ఎదురుగా ఉన్న వాహనం నగర పోలీస్ కమిషనర్‌ది
హర్షవర్దన్ చౌదరి అండ లేకుండానే నిందితుడు బరితెగించాడా?
గతంలో ఎన్నో కేసుల్లో నిందితుడైన శ్రీనివాసరావును రక్షణ శాఖ అధీనంలోని విశాఖ ఎయిర్‌పోర్టులో తన రెస్టారెంట్‌లో నియమించుకోవడం.. కత్తులు, మారణాయుధాలతో ఎయిర్‌పోర్ట్ రెస్టారెంట్‌లో అతడు విచ్చలవిడిగా సంచరించడం, శ్రీనివాసరావుకు ప్రత్యేకంగా వసతి కల్పించడం, మిగిలిన ఉద్యోగుల కంటే అధికంగా వేతనం ఇవ్వడం, వైఎస్ జగన్‌పై వ్యూహాత్మకంగానే ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం చేయడం.. ఈ వరుస పరిణామాలను గమనిస్తే హర్షవర్దన్ చౌదరి అండ లేకుండానే శ్రీనివాసరావు ఈ ఘాతుకానికి తెగబడ్డాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 25న మధ్యాహ్నం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగే సమయానికి సరిగ్గా 10 నిమిషాల ముందే హర్షవర్దన్ చౌదరి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం.
ఘటన తరువాత శ్రీనివాసరావు చాలా మంచోడండి, అమాయకుడండి, ఏదో అభిమానంతో పిచ్చి పని చేసుంటాడు అని వకాల్తా పుచ్చుకున్న హర్షవర్దన్ చౌదరి తీరుపై అనుమానాలు వెల్లువెత్తాయి. తన వద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఏకంగా ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి పాల్పడితే... సదరు ఉద్యోగినే వెనకేసుకొచ్చిన హర్షవర్దన్ చౌదరి నిర్వాకంపై పోలీసులు దృష్టి పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. పోలీసులు తమపై వస్తున్న విమర్శలకు తలొగ్గి హర్షవర్దన్ చౌదరిని దీపావళి పండుగ తర్వాత తమదైన శైలిలో విచారించాలని భావించారు. అయితే, హర్షవర్దన్ చౌదరి జోలికి వెళ్లొద్దంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో తాము మిన్నకుండిపోయామని ఓ పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. హర్షవర్దన్ చౌదరిని విచారిస్తే మొత్తం డొంకంతా కదిలి కుట్రకోణం బట్టబయలై, అసలు కుట్రదారుల పేర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉండడం వల్లే సీఎంవో నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయని అంటున్నారు.
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో బీసీఏఎస్ దర్యాప్తు
ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన నేపథ్యంలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా(బీసీఏఎస్) అధికారులు గురువారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బీసీఏఎస్ అధికారి పాల్ ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్, పరిసర ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించారు. హత్యాయత్నం జరిగిన తీరు, తదనంతర పరిణామాల గురించి ఎయిర్‌పోర్టు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విజయదుర్గను మరోసారి విచారించనున్న ‘సిట్’
ముమ్మిడివరం: ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసులో సిట్ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు వద్ద దొరికాయని చెబుతున్న లేఖలను రాసిన అతడి సమీప బంధువు విజయదుర్గను గతంలో ‘సిట్’ సీఐ విశ్వేశ్వరరావు విశాఖపట్నం తీసుకువెళ్లి, విచారించి, తిరిగి పంపించారు. ఆయితే, మూడు రోజుల క్రితం విజయదుర్గ ఫోన్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కాల్‌డేటా ఆధారంగా మరోసారి విచారించేందుకు విజయదుర్గను విశాఖపట్నం తీసుకురావాలని స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందింది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం పోలీసులు గురువారం ఆమెను విశాఖపట్నం తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment