
వాషింగ్టన్: తనపై మరోసారి పోటీ చేయాలని హిల్లరీ క్లింటన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సవాలు విసిరారు. హిల్లరీని రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆయన.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనతో తలపడాలన్నారు. కొన్ని బయటి శక్తుల వల్లే తాను ఓడిపోయానని ఇటీవల హిల్లరీ తరచూ పేర్కొనడంపై స్పందిస్తూ.. ఆమె బలహీన అభ్యర్థి అని వ్యాఖ్యానించారు. ‘హిల్లరీ మళ్లీ పోటీచేస్తారని నేను భావిస్తున్నా. దయచేసి మళ్లీ ఎన్నికల్లో పోటీచేయండి?’ అని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
నిజంగానే అనేక కారణాల వల్ల ఆమె ఓడిపోయారని, అయితే అందులో హిల్లరీ మంచి పనులు చేయకపోవడం కూడా ఒకటని ట్రంప్ విమర్శించారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఎన్‌ఎఫ్‌ఎల్ ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చో వడాన్ని హిల్లరీ సమర్థించడాన్ని ట్రంప్ తప్పుపడుతూ.. హిల్లరీ ప్రకటన దేశాన్ని అవమానించినట్లేనని చెప్పారు.
రాజకీయ పోరాటం కొనసాగిస్తా: హిల్లరీ
ట్రంప్ వ్యాఖ్యలకు హిల్లరీ సమాధానమిస్తూ.. అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేయనని, అయితే రాజకీయాల్లో కొనసాగుతూ ట్రంప్‌కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో అసలు ఓటమి ఆలోచనే రాలేదని, విజయోత్సవ ప్రసంగాన్ని ముందుగానే సిద్ధం చేసుకున్నానని అప్పటి సంగతుల్ని ఆమె గుర్తుచేసుకున్నారు.