సియోల్ : అగ్ర రాజ్యంగా బాధ్యత కలిగిన ఓ దేశాధ్యక్షుడు అయి ఉండి రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం సరికాదని డొనాల్డ్ ట్రంప్ కి హిల్లరీ క్లింటన్ సూచించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియాతో యుద్ధం వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు.
‘ఉత్తర కొరియాతో యుద్ధానికి సిద్ధమని పదేపదే ట్రంప్ ప్రకటన చేయడం సరికాదు. ఇలాంటి ప్రకటనలు అమెరికాకే ప్రమాదకరం. కవ్వింపు ప్రకటనలతో ట్రంప్ చేసే ట్వీట్లు ఉత్తర కొరియాకే లాభం చేకూరుస్తాయి. అవి ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌ను మరింత ఉన్మాదిగా మారుస్తాయి. అసలు వారిపై అంతలా విరుచుకుపడాల్సిన అవసరం కూడా లేదు’ అని హిల్లరీ పేర్కొన్నారు.
ఇక అణు, క్షిపణి పరీక్షలు చేయకుండా ఉత్తర కొరియాను నిరోధించడంలో కీలకపాత్ర పోషించాలని చైనాను ఆమె కోరారు. అణు పరీక్షలను అభినందించటం మంచిది కాదని ఆమె చైనాకు హితవు పలికారు. మరిన్ని ఆంక్షలు విధించటం ద్వారా దారిలోకి తీసుకురావాలని డ్రాగన్ కంట్రీకి ఆమె సూచించారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలని.. ఆ దిశగా వారిని (ఉత్తర కొరియా)ను ఒప్పించాలని అగ్ర దేశాలకు ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment