సాక్షి, కాకినాడ : తాను పవన్‌పై చేసిన వ్యాఖ్యలను జనసేనకు చెందిన కొందరు నేతలు పని గట్టుకొని కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన కార్యకర్తలు ద్వారంపూడి ఇంటిపై రాళ్లదాడి చేయటంతో పరిస్థితులు అదుపుతప్పిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ద్వారంపూడి మీడియాతో మాట్లాడారు.
'మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ అనేక ఉద్యమాలు చేశారు. ఒక్క ఉద్యమానికైనా పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారా? దీనిని బట్టే పవన్ టీడీపీకి ఎంత మద్దతిస్తున్నాడనేది అర్థమవుతుంది. గత ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యేలను కాకుండా కేవలం వైసీపీ అభ్యర్థులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని విమర్శించారు. కాపు ఉద్యమ సమయంలో ముద్రగడ కుటుంబంపై లాఠీచార్జ్ చేస్తే పవన్ గానీ జనసేన నాయకులు కానీ ఖండించలేదు. ముద్రగడ బహిరంగ సభ పెడితే నా వెంట ఉన్న కాపులంతా 25 బస్సులతో వెళ్లి ఉద్యమానికి మద్దతిచ్చాం. కాపు ఉద్యమానికి చంద్రబాబు వ్యతిరేకం. అందుకే పవన్‌కళ్యాణ్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. పవన్ టీడీపీకి మద్దతు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి' అంటూ ద్వారంపూడి ధ్వజమెత్తారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఒకటేనని, వాళ్లిద్దరూ కుమ్మక్కయ్యారన్న విషయం తెలియని జనసేన నాయకులు ఇంకా భ్రమలోనే బతుకుతున్నారని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. చంద్రబాబు గత పదిహేను రోజులుగా తన బినామీలతో సోషల్‌మీడియాలో ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టించారని మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తిని పట్టుకొని నియంత, తుగ్లక్ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో బొండా ఉమతో వైఎస్ జగన్‌ను చంద్రబాబు తిట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు మన రాష్ట్రంలో ఉండడం నిజంగా దౌర్భాగ్యమని దుయ్యబట్టారు.
(ఢిల్లీలో పవన్ కల్యాణ్ నిరీక్షణ)
Comments
Please login to add a commentAdd a comment