
పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సిద్ధూ ప్రచారంపై ఎన్నికల కమిషన్ 72 గంటలపాటు నిషేధం విధించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి నిషేధం అమల్లోకి వస్తుంది. సిద్ధూ ఈనెల 16న బిహార్‌లోని కటిహార్ ప్రచారంలో మాట్లాడుతూ, ముస్లిం ఓట్లు చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముస్లింలంతా ఐక్యమై ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాలన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి తారిఖ్ అన్వర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన ఈ మాటలన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతోపాటు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్‌లో సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్ ఎన్నికల ప్రచారంపై కూడా ఇంతకుముందు ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కూడా ఈసీ ఇదేరకమైన చర్య తీసుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు, మతమనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేసినందుకు కేంద్రమంత్రి మేనకా గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి వరుసగా రెండు రోజులు ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది.