సాక్షి, న్యూఢిల్లీ : ఒకే ఎన్నికల కోడ్. రెండు ఒకే తరహా రైతు ఆర్థిక భరోసా స్కీమ్‌లు. ఓ స్కీమ్ కేంద్రానిది, మరో స్కీమ్ రాష్ట్రానిది. ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో మాత్రం ద్వంద్వ ప్రమాణాలు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘పీఎం కిసాన్ స్కీమ్’ కింద దేశంలోని రైతులకు 19 వేల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. అదే ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ‘కాలియా స్కీమ్’ కింద రైతులకు పంట పెట్టుబడి కింద నిధులను విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధానాధికారి అనుమతించలేదు. పైగా కేంద్రం కన్నా ముందు నుంచే ఒడిశా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ రెండు పథకాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతు బంధు’ పథకం లాంటివే.
తెలంగాణ రాష్ట్రంలో లాగా కాకుండా ఒడిశా ఈ రైతు ఆర్థిక భరోసా పథకాన్ని సన్న, చిన్నకారు రైతులతోపాటు భూమి కౌలుదారులకు (టెనెంట్స్) కూడా అమలు చేస్తోంది. అంతేకాకుండా కేంద్రంలోలాగా ఆరువేలో, తెలంగాణలాగా తొమ్మిదివేలో కాకుండా ఏడాదికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. రెండు ఒకే తరహా పథకాలు అయినప్పుడు కేంద్రం నిధుల విడుదలకు అనుమతించిన ఎన్నికల కమిషన్ తమ రాష్ట్రం నిధుల విడుదలను అడ్డుకోవడం ఏమిటని ఒడిశా పాలకపక్ష బిజూ జనతాదళ్ అధికార ప్రతినిధి సుశ్మిత్ పాత్ర ప్రశ్నించారు.
ఆయన ప్రశ్నే సహేతుకమే. అటు కేంద్రం అమలు చేస్తున్న పథకం, ఇటు ఒడిశా అమలు చేస్తున్న పథకం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి పదవ తేదీకి ముందు ప్రకటించినవే. లబ్ధిదారులను కూడా ముందే గుర్తించారు. అయినా సరే, ఎన్నికల సమయంలో ఓటర్ల చేతికి డబ్బు అందడమంటే అది ప్రలోభానికి గురి చేయడానికే అని అర్థం చేసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి నిధుల విడుదలను అడ్డుకున్నారు. ఎన్నికలకు ముందే పథకాన్ని ప్రకటించడమే కాకుండా లబ్ధిదారులను కూడా గుర్తించినందున ఎన్నికల సమయంలో నిధులను విడుదల చేయడంలో తప్పులేదని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అనుమతి ఇచ్చింది.
ఎన్నికల సమయంలో పాలకపక్ష పార్టీ తన అధికారాన్ని ఉపయోగించి ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సంప్రతింపులు జరిపి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్‌ను రచిస్తుంది. అలాంటప్పుడు రాష్ట్రం విషయంలో ఒకలాగా, కేంద్రం విషయంలో ఒకలాగా కోడ్‌ను అమలు చేయడం ద్వంద్వ ప్రమాణాలను పాటించడమే అవుతుంది. ఎన్నికల అధికారుల మధ్య దృక్పథాల్లో తేడా వచ్చినప్పుడు సంప్రతింపుల ద్వారా అలాంటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తోందన్న అపవాదు లేదా ఆరోపణలు రాకముందే కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment