న్యూఢిల్లీ: భారత సైన్యాన్ని ‘మోదీ సేన’ గా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కేవలం మందలించి వదిలేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత ఆర్మీని యోగి అవమానిస్తే.. అందుకు బదులుగా ఈసీ ఆయనకు ‘ప్రేమలేఖ’ రాసిందని మండిపడింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) కాస్తా మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్‌గా మారిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా విమర్శించారు. అధికారంలో ఉన్నవారిపై చర్యలు తీసుకునేందుకు ఈసీ భయపడుతుందా? అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పేదలకు కనీస ఆదాయ పథకాన్ని విమర్శించిన నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్‌ను.. ‘మళ్లీ ఇలా చేయొద్దంటూ’ ఈసీ హెచ్చరించి వదిలేసిందని, అలాగే యోగిని కూడా మందలించి వదిలేసిందని, కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఈసీ ఎందుకు భయపడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. భారత ఆర్మీ మోదీ సేన అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన యోగిని ఈసీ శనివారం హెచ్చరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment