
దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఆదివారం నుంచే అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ప్రభుత్వాలు కొత్త పథకాలు ప్రకటించడంతో పాటు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనల కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉండదు.
ఇక లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా పలు విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.
చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ (175), ఒడిషా (147), సిక్కిం (32), అరుణాచల్ ప్రదేశ్ (60) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.