న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి శుక్రవారం ఊరట లభించింది. ఉపగ్రహ విధ్వంస క్షిపణి(ఏ–శాట్) ప్రయోగంపై ప్రధాని ప్రసంగం ఎన్నికల నిబంధనలకు లోబడే ఉందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. ప్రధాని ప్రసంగం ఎక్కడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని ఈసీ స్పష్టం చేసింది. ఉన్నతాధికారులతో తాము ఏర్పాటుచేసిన కమిటీ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చివేయగల ఏ–శాట్ క్షిపణిని ‘మిషన్ శక్తి’ పేరుతో విజయవంతంగా పరీక్షించినట్లు మోదీ బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు. భూదిగువ కక్ష్యలో 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఓ ఉపగ్రహాన్ని ఏ–శాట్ కేవలం 3 నిమిషాల్లో కూల్చివేసిందని వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈ సామర్థ్యం సంతరించుకున్న నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని ప్రధాని పేర్కొన్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాని ఈ ప్రసంగం ద్వారా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ప్రతిపక్షాలు ఈసీకి రాతపూర్వకంగా ఫిర్యాదుచేశాయి.
Comments
Please login to add a commentAdd a comment