సోమవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో పాల్గొన్న ఎంపీ వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి అన్ని రకాల రాజకీయ ప్రచారాలకు స్వస్తి చెప్పే నిబంధనను సోషల్ మీడియాకు కూడా వర్తింపజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీఆర్‌ఎస్ పార్టీ కోరింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మీడియాలో ప్రకటనలు జారీ చేస్తే ఎన్నికల సంఘం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో సోషల్ మీడియాపై కూడా అదేవిధమైన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ కోరింది. ఎన్నికల సంస్కరణలపై పార్టీల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమా వేశంలో టీఆర్‌ఎస్ తరఫున ఎంపీ వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై పరిమితులున్నట్టే ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చులపై కూడా పరిమితులు విధించాలని ఆయన కోరారు. అభ్యర్థుల ఖర్చులేకాకుండా రాజకీయ పార్టీల ఖర్చులపై పరిమితులకు ఉద్దేశించి కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా ప్రతిపాదన చేస్తే టీఆర్‌ఎస్ పార్టీ తరఫున తమ అభిప్రాయాన్ని చెబుతామని పేర్కొన్నారు. ఇక చట్టసభల్లోనే కాకుండా రాజకీయ పార్టీల వ్యవస్థాగత పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రతిపాదనకు తమ పార్టీ మద్దతిస్తుందని, ఆ దిశగా తమ పార్టీ ఇప్పటికే పనిచేస్తోందని వినోద్ తెలిపారు.
మెగా డైరీ ప్లాంట్‌కు కేంద్రం అనుమతులు..
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో కరీంనగర్ పాల ఉత్పత్తి సంస్థ ఏర్పాటు చేయనున్న మెగా డైరీ ప్లాంట్‌కు కేంద్రం అనుమతులిచ్చిందని ఎంపీ వినోద్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆ మేరకు సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ నిర్ణయించారని చెప్పారు. ఈ ప్లాంట్‌కు సదరు సంస్థ రూ. 63 కోట్లు వెచ్చించనుందని, డైరీ వల్ల 75 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment