సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో శనివారం ఆయన గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఫెర్నాండెజ్ విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అధికార పార్టీ అక్రమాలే కారణమన్నారు.
ఏ గుర్తుకు ఓటేసినా, ఎన్నిసార్లు ఈవీఎం బటన్‌ను నొక్కినా ఓట్లు బీజేపీ గుర్తుమీదనే పడుతున్నాయని ఆరోపించారు. ఈవీఎంలను పెద్దఎత్తున ట్యాంపరింగ్ చేసి, బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. దేశమంతటా కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, గుజరాత్‌లోనూ రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పడుతున్నారని ఆస్కార్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మల్లు రవి, దాసోజు శ్రవణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాహుల్ ఎన్నికకు మూడు సెట్ల నామినేషన్లు
ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ నెల 4న టీపీసీసీ నుంచి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రం నుంచి 30 మంది ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెప్పారు. కాగా, 29 రాష్ట్రాల్లో ఉన్న పీసీసీలు మొత్తం రాహుల్ గాంధీ పేరును ఏకగ్రీవంగా బలపరిచాయన్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ ఎన్నిక లాంఛనప్రాయమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment