ఎమ్మెల్యే రామానాయుడు, కాంట్రాక్టర్ పృథ్వీరాజ్
కాంట్రాక్టర్లు తనను కలిసేలా అధికారుల ద్వారా ఒత్తిడి తేవడం ఆయన స్టైల్. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డెల్టా ఆధునికీకరణ పనులు జరుగుతున్నా పాలకొల్లులో మాత్రం టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి సదరు ఎమ్మెల్యే వైఖరే కారణమనే విమర్శలున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అడిగినంత కమీషన్లు చెల్లించలేదనే ఆగ్రహంతో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బిల్లులు మంజూరు కాకుండా అడ్డుకోవడంతోపాటు తనపై తప్పుడు కేసులు బనాయించి పోలీసుల ద్వారా వేధిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ ఆరోపించారు. పాలకొల్లు సీఐ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తూ తనను బెదిరించినట్లు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
ఇదీ జరిగింది....
డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా పాలకొల్లులో మురుగునీటి కాల్వ (దమ్మయ్యపత్తి కోడు) కాంక్రీట్ గోడల నిర్మాణ టెండర్లను పీఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ గత నవంబర్‌లో దక్కించుకుంది. సబ్‌కాంట్రాక్టర్ పృథ్వీరాజ్ డిసెంబర్ నెలాఖరు నాటికి 210 మీటర్లకుగాను 95 మీటర్ల పనులు పూర్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేసి రూ.60 లక్షల బిల్లు పెట్టారు. అయితే ఎన్ని నెలలు గడిచినా బిల్లులు రాలేదు. ఇరిగేషన్ ఉన్నతాధికారుల సలహా మేరకు ఆయన ఎమ్మెల్యే వద్దకు వెళ్లగా టెండర్ అంచనా మొత్తంపై కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ, టీడీఎస్ మినహాయించి కాంట్రాక్టు విలువపై ఐదు శాతం కమీషన్ ఇస్తానని కాంట్రాక్టర్ చెప్పడంతో ఎమ్మెల్యే ఒప్పుకోలేదు. తాను ఇప్పటికే నష్టాల్లో ఉన్నానని బిల్లులు వస్తే తప్ప పనులు చేయలేనని కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. దీంతో అప్పటి నుంచి ఎమ్మెల్యే వేధింపులు మొదలయ్యాయని, తనను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారని కాంట్రాక్టర్ చెబుతున్నారు. కాంట్రాక్టు ప్రకారం పనులు పూర్తి చేయడానికి ఇంకా పది నెలల గడువు ఉన్నా ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావుతో ఫిర్యాదు చేయించి పోలీస్‌స్టేషన్‌కు పిలిచారని తెలిపారు.
స్టేషన్‌కి పిలిచి బెదిరింపులు
పాలకొల్లు టౌన్ సీఐ కృష్ణకుమార్ ఎమ్మెల్యే రామానాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంట్రాక్టర్‌ను శనివారం మధ్యాహ్నం స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే చెప్పేవరకూ వదలొద్దంటూ సిబ్బందిని ఆదేశించారు. 20 రోజుల క్రితం కాలికి ఆపరేషన్ చేయించుకున్న కాంట్రాక్టర్ పృథ్వీరాజ్‌ను కనీసం బాత్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఈ విషయాన్ని మీడియాతోపాటు పాలకొల్లు మున్సిపాలిటీలో ప్రతిపక్షనేత యడ్ల తాతాజీ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వైఎస్సార్ సీపీ నేత గుణ్ణం నాగబాబుతో కలసి స్టేషన్‌కు వచ్చి గట్టిగా నిలదీయడంతో పోలీసులు కాంట్రాక్టర్‌ను పంపించారు. ఈ విషయంలో తన ప్రమేయం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫిర్యాదు చేశానని డీఈ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.
న్యాయం కోసం పోరాడతా
కమీషన్ ఇవ్వలేదని బిల్లులు అడ్డుకోవడంతోపాటు తనపై ఫిర్యాదు చేసి వేధించిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు వ్యతిరేకంగా పోరాడతానని కాంట్రాక్టర్ పృ«థ్వీరాజ్ తెలిపారు. ఎమ్మెల్యే ప్రోద్భలంతో సీఐ కృష్ణకుమార్ తనను వేధించారని ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు సోమవారం సాయంత్రం ఆయన ఫిర్యాదు చేశారు.
అవినీతికి మార్కులు వేస్తున్న చంద్రబాబు
ఎవరైనా అభివృద్ధి చేయడంలో మార్కులు వేస్తారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం అవినీతికి మార్కులు వేసే దుస్థితికి దిగజారారు. పార్టీ ఎమ్మెల్యే రామానాయుడుకు టీడీపీ మొదటి ర్యాంకు ఇవ్వడంతో కమీషన్లలో 10 శాతం లోకేష్‌కు అందజేస్తున్నారు. కాంట్రాక్టర్లు తనను కలవాలంటూ ఎమ్మెల్యే అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. కమీషన్ ఇవ్వకుంటే కేసులు పెట్టి పోలీసుల ద్వారా రాబట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే రామానాయుడి అవినీతిపై విచారణ జరిపించాలి.
– గుణ్ణం నాగబాబు, వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్
వివాదానికి కారణమైన పాలకొల్లు దమ్మయ్యపత్తి కోడు డ్రెయిన్
Comments
Please login to add a commentAdd a comment