బంజారాహిల్స్: పాతికేళ్ల వయస్సులోనే ఎన్నికల రణరగంలోకి దూకిన ఓ సాదాసీదా ఉద్యోగి కాకలు తీరిన రాజకీయ కురువృద్ధుడ్ని ఓడించి అప్పట్లో రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమయ్యారు. అయితే ఎన్నికల్లో చేసిన అప్పును ఎమ్మెల్యే హోదాలో ఉండికూడా తీర్చుకోలేకపోయారు. ఇప్పటికీ హైదరాబాద్‌లో సొంతిల్లు లేక అద్దెగదిలోనే కాలం వెల్లబుచ్చుతున్న పాలకొలను నారాయణ రెడ్డి (82) ఎమ్మెల్యే కథ ఆసక్తికరం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుండి 1966–1967 శాసనసభ కాలంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. 1962లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన సీ.రాజగోపాల చారి అలియాస్ రాజాజీ స్వతంత్ర పార్టీ పేరుతో ఓ పార్టీని నెలకొల్పారు. అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కుర్రాళ్లను రంగంలోకి దింపారు. హైకోర్టులో ఉద్యోగం చేస్తున్న నారాయణ రెడ్డి కూడా సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తుండడంతో మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాల్సిందిగా పిలుపొచ్చింది. అయితే అక్కడ కాకలు తీరిన కాంగ్రెస్ అభ్యర్థి ఉండటంతో ఆయనతో పోటీ చేసి గెలవడం కష్టమని నారాయణ రెడ్డి వెనకడుగు వేసి తనవద్ద అంత డబ్బు కూడా లేదని చెప్పారు. నువ్వు తప్పకుండా గెలుస్తావు ఎన్నికల ఖర్చుకింద 2వేలు ఉంచుకోవాలంటూ రాజాజీ బలవంతంగా ఎన్నికల క్షేత్రంలోకి దింపారు. గెలిచినా, ఓడినా పెద్ద నష్టమేమీ లేదనుకున్న నారాయణ రెడ్డి నామినేషన్ల ప్రక్రియ రేపనగా పార్టీలో చేరి ప్రచారంలో ఊరూరా తిరిగాడు.
వారం గడిచిన తర్వాత ఆయనకు మద్దతుగా ఉవ్వెత్తున ఊర్లు కదలివచ్చాయి. రూ.10 వేలు అప్పుచేసి రాజాజీ ఇచ్చిన రూ.2 వేలు కలిపి ఆ ఎన్నికల్లో మెత్తం రూ.12 వేలు ఖర్చుచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు తాను గెలవడమేంటని అనుకుని హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. తాను గెలిచిన విషయాన్ని రాత్రి రేడియోలో చెప్పేదాకా నమ్మలేకపోయానన్నారు. అప్పుడు కడపలో స్వతంత్ర పార్టీ నుండి 7 మంది పోటీ చేస్తే 7 మందీ గెలిచారని గుర్తుచేసుకున్నారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సభలో తాను ఎమ్మెల్యేనని నీతి, నిజాయతీతో సేవలందించానని ఒక్క రూపాయి కూడా అవకతవకలకు పాల్పడలేదని తెలిపారు. అయితే అప్పుడు కూడా ఫిరాయింపులు, ఆకర్‌ష పథకాలు ఉండేవని తాను కాంగ్రెస్‌లో చేరితే ఆ తర్వాత ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చి మంత్రిపదవి కూడా ఇస్తామని ప్రలోభపెట్టినా తాను జంప్ కాలేదని, నమ్మిన పార్టీతోనే కట్టుబడి ఉన్నానని వెల్లడించారు.
గడ్డిఅన్నారం డివిజన్‌లో ప్రచారంలో భాగంగా కూరగాయలు అమ్ముతున్నఎల్‌బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
అప్పుడు స్వతంత్ర పార్టీ నుండి గెలిచిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రలోభాలకు గురికాకుండా నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారని చెప్పారు. అప్పుడు తన నెలజీతం రూ.250 ఉండేదని, ఎన్నికలకోసం చేసిన రూ.3 వేల అప్పు కూడా మాజీ అయిన తర్వాత కూడా తీర్చుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో రూ.7వేలు అద్దె చెల్లిస్తూ రెండు గదుల ఇంటిలో ఉంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని, ఇప్పుడు అన్ని ప్రలోభాలు ఫిరాయింపులే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్చ రాజకీయాలు పూర్తిగా కనుమరుగయ్యాయని, పక్క పార్టీ నుండి ఎమ్మెల్యేలను లాక్కోవడమే పనిగా పెట్టుకుని అదే అభివృద్ది అంటూ జబ్బలు చరుచుకుటున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలంటే ఇప్పుడున్న ప్రజలకు గౌరవం పోతుందని మళ్ళీ అప్పటిరోజులు రావాలంటే కొత్త నాయకులు పుట్టాల్సిందే అన్నారు. ఇప్పటి ఎన్నికల ప్రచార తీరుతెన్నులు కూడా అసహ్యంగా ఉన్నాయని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంతోనే సరిపెట్టుకుటున్నారు తప్పితే ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిపై పోరాటం చేయాలని, ఏ అభ్యర్థి కూడా అనుకోవడంలేదన్నారు. ఇప్పుడు అంతా డబ్బుతో ప్రచారమని, తమ కాలంలో ఊరూరా తిరిగితే ప్రచారమని ప్రచారతీరును పోల్చారు.
Comments
Please login to add a commentAdd a comment