సన్యాసం స్వీకరించిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే | Badvel Former MLA Siva Rama Krishna Rao Takes Monachism In YSR Kadapa | Sakshi
Sakshi News home page

సన్యాసం స్వీకరించిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే

Published Sat, Apr 3 2021 12:06 PM | Last Updated on Sat, Apr 3 2021 3:15 PM

Badvel Former MLA Siva Rama Krishna Rao Takes Monachism In YSR Kadapa - Sakshi

గోదావరి పుష్కర ఘాట్‌లో గురువు శ్రీ సద్గురు తత్వ విదానందసరస్వతీచే దీక్ష స్వీకరిస్తున్న శివరామకృష్ణారావు (వృత్తంలో వ్యక్తి)

సాక్షి, కడప: రాజకీయ సన్యాసం.. రాజకీయాల్లో నేతల మధ్య తరచూ వినిపించే మాట. ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగిన నేత ఏకంగా సన్యాసం స్వీకరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బద్వేలు నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ శివరామకృష్ణారావు రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు. ఇకపై ఆయన స్వామి శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు. డాక్టర్‌ వడ్డెమాను శివరామకృష్ణారావు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఇదే నియోజకవర్గంలోని అట్లూరు మండలం కమలకూరు స్వగ్రామం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా ఈయన క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగారు. 1972లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బిజివేముల వీరారెడ్డిపై తొలుత ఓటమి చెందారు.

1977లో బద్వేలు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో ఓటమి చెందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 1994, 1999, 2001 ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు. శివరామకృష్ణారావుతోపాటు అప్పట్లో పులివెందుల నుంచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మైదుకూరు నుంచి డీఎల్‌ రవీంద్రారెడ్డిలు 1972లో తొలిసారి గెలుపొందారు. ముగ్గురు వైద్యులు కావడం, యువకులుగా అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. నాటి ముఖ్యమంత్రి అంజయ్య కేబినెట్‌లో మంత్రి పదవి అవకాశం వచ్చినా తన మిత్రుడైన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కోసం త్యాగం చేసి వైఎస్‌కు అత్యంత సన్నిహితునిగా గుర్తింపు పొందారు.

అంతకుముందు శివరామకృష్ణారావు తండ్రి వడ్డెమాను చిదానందం 1952లో తొలి జనరల్‌ ఎలక్షన్లలో బద్వేలు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955లో మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆయన 1962లో బద్వేలు నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి మరోమారు శాసనసభ్యునిగా ఎన్నిక కావడం గమనార్హం. బ్రహ్మణ సామాజికవర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శివరామకృష్ణారావు ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2004లో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారడంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండోసారి సీఎంగా ఎన్నికైన వైఎస్సార్‌ ఆయనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని భావించినా ఆయన అకాల మరణం శివరామకృష్ణారావుకు ఊహించని షాక్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఏపీ స్టేట్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు.

రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2015 నుంచి ఆధ్యాత్మిక చింతనవైపు మొగ్గుచూపిన శివరామకృష్ణారావు మానస సరోవర్, చార్‌దాం, అమర్‌నాథ్‌తో పాటు శక్తి పీఠాలను సందర్శించారు. రిషికేశ్‌కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్నారు. మూడు నెలలుగా పూర్తి ఆధ్యాత్మిక జీవితంవైపు ఆకర్షితులైన ఆయన ఎట్టకేలకు సన్యాస దీక్ష తీసుకోవాలని నిర్ణయించారు.

ఈ మేరకు గురువారం రాజమండ్రి పుష్కరఘాట్‌ వద్ద గురువు శ్రీ సద్గురు తత్వ విదానందసరస్వతీ ఆధ్వర్యంలో దీక్ష తీసుకున్నారు. ప్రజల అభిమానం, ఆశీస్సులతో తాను ఈ స్థాయికి చేరుకున్నానని శ్రీ శివరామానంద సరస్వతి ‘సాక్షి’కి తెలిపారు. అందరిలో భగవంతుడు ఉన్నాడని, ఆయన సూచనలతోనే తాను సన్యాస దీక్ష తీసుకున్నానన్నారు. సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని చింతతోనే గడపాలన్నది లక్ష్యమన్నారు. మొత్తానికి ఓ సీనియర్‌ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే రాజకీయాలను వదిలి సన్యాసం స్వీకరించడం బలమైన నిర్ణయమే. ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

చదవండి: 58.16 లక్షల మందికి అందిన పింఛన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement