ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుకు ఇంటి తాళం చెవి ఇస్తున్న మోదీ
డాల్టన్‌గంజ్/బరీపదా: గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడపడంపోయి, రక్షణ రంగంలో మధ్యవర్తుల ఆదేశాలతో పాలన సాగించిందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్ నాడు ప్రభుత్వాన్ని నడిపిందో లేక తమ మిషెల్ (అగస్టా కుంభకోణంలో మధ్యవర్తి) మామ దర్బార్ నడిపిందో అర్థంకాట్లేదు’ అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు. అలాగే రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను తప్పుదోవ పట్టిస్తోందనీ, ఆ పార్టీకి రైతులంటే కేవలం ఓటు బ్యాంకేనని ఆయన ఆరోపించారు.
జార్ఖండ్, ఒడిశాల్లో మోదీ శనివారం పర్యటించి వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. బిహార్, జార్ఖండ్‌ల సరిహద్దుల్లోని 19.6 వేల హెక్టార్ల భూమికి సాగు నీరు అందించే కోయెల్ కరో మండల్ ప్రాజెక్టు సహా పలు నీటి పారుదల ప్రాజెక్టులకు మోదీ జార్ఖండ్‌లో పునాది రాయి వేశారు. అక్కడ మోదీ మాట్లాడుతూ ‘గతంలో రైతులు అప్పులు తీసుకునేలా కాంగ్రెస్సే చేసింది. ఇప్పుడు రుణాలను మాఫీ చేస్తామంటూ తప్పుదోవ పట్టిస్తోంది. నేను కూడా వ్యవసాయదారులను ఓటు బ్యాంకుగానే పరిగణించి ఉంటే, లక్ష రూపాయల రుణమాఫీని నేనే అమలు చేసేవాణ్ని.
కానీ పంట దిగుబడులను పెంచి, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి రాబోయే తరాల కర్షకులకు కూడా లాభదాయకంగా ఉండే విధానాలు తీసుకొచ్చేందుకు మేం ప్రాధాన్యమిస్తున్నాం’ అని మోదీ చెప్పారు. ప్రాజెక్టు పేరులోని ‘కోయెల్’ అంటే అసలు ఇది ప్రాజెక్టు పేరా, నది పేరా, పక్షి పేరా అన్న విషయం కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలిసుండకపోవచ్చని మోదీ ఎద్దేవా చేశారు. నీళ్లు, ఇతర అంశాలపై ఇరుగుపొరుగు రాష్ట్రాలు గొడవలు పడుతున్న వేళ.. జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌లు కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టడం సమాఖ్య వ్యవస్థకు మంచి ఉదాహరణ అని మోదీ ప్రశంసించారు.
సైన్యంపై కుట్ర: మోదీ
ఒడిశాలోని బరీపదాలో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ‘దేశ సైన్యాన్ని బలహీన పరిచేందుకు 2004–14 మధ్య కుట్ర జరిగింది. ఇప్పుడు ఆ నిజాలు బటయకొస్తుంటే కాంగ్రెస్ నేతలకు నొప్పిగా ఉంది’ అని అన్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను ఇప్పుడు తమ ప్రభుత్వం భారత్‌కు తీసుకొచ్చి విచారిస్తుండటంతో తమ రహస్యాలు బయటకొస్తాయని కాంగ్రెస్ పెద్దలు భయపడుతున్నారని మోదీ పేర్కొన్నారు. లోక్‌సభలో శుక్రవారం రఫేల్ ఒప్పందం వివాదంపై సమాధానమిచ్చిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై మోదీ ప్రశంసలు కురిపించారు. ఒడిశాలో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. మోదీ ప్రారంభించిన, శంకుస్థాపనలు చేసిన మొత్తం ప్రాజెక్టుల విలువ రూ.4,000 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment