ఫారూఖ్‌కు గట్టి పరీక్ష | Farooq Abdullah Tough Fight in Srinagar | Sakshi
Sakshi News home page

ఫారూఖ్‌కు గట్టి పరీక్ష

Published Sun, Apr 14 2019 5:11 AM | Last Updated on Sun, Apr 14 2019 5:23 AM

Farooq Abdullah Tough Fight in Srinagar - Sakshi

ఫారూఖ్‌ అబ్దుల్లా, ఇర్ఫాన్‌ అన్సారీ

జమ్మూ, కశ్మీర్‌ రాజధాని నియోజకవర్గమైన శ్రీనగర్‌ నుంచి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ)కు నాయకత్వం వహించే షేక్‌ అబ్దుల్లా కుటుంబ సభ్యులు ముగ్గురు గతంలో ఏడుసార్లు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు ఫారూఖ్‌ అబ్దుల్లా మరోసారి శ్రీనగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో అబ్దుల్లాను పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ (పీడీపీ) అభ్యర్థి తారిఖ్‌ హమీద్‌ కర్రా 42 వేలకు పైగా మెజారిటీతో ఓడించారు. 2017లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసిన అబ్దుల్లా తన సమీప పీడీపీ అభ్యర్థి నజీర్‌ అహ్మద్‌ ఖాన్‌పై పది వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ఈ ఉప ఎన్నికలో జనం స్వల్ప సంఖ్యలో (7 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఫారూఖ్‌ అబ్దుల్లాతోపాటు ఆగా సయ్యద్‌ మొహిసిన్‌ (పీడీపీ), ఖాలిద్‌ జహంగీర్‌ (బీజేపీ) ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 2014లో ప్రస్తుత పీడీపీ అభ్యర్థి ఆగా మొహిసిన్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి 16 వేల ఓట్లు సాధించారు. ఈ నెల 18న పోలింగ్‌ జరిగే శ్రీనగర్‌ స్థానంలో దాదాపు 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో మూడు జిల్లాలకు చెందిన 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

అబ్దుల్లా కుటుంబానికి కంచుకోట
ఫారూఖ్‌ అబ్దుల్లా తల్లి బేగం అక్బర్‌ జహాన్‌ ఒకసారి (1977), ఫారూఖ్‌ మూడుసార్లు (1980, 2009, 2017), ఆయన కొడుకు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా మూడు సార్లు (1998, 99, 2004) శ్రీనగర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఎన్నికల్లో పరాజయం ఎరగని ఫారూఖ్‌ 2014లో నగరానికి చెందిన పీడీపీ అభ్యర్థి తారిఖ్‌ కర్రా చేతిలో ఓడిపోవడం సంచలనం అయింది. తర్వాత కర్రా పీడీపీకి, లోక్‌సభకు రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో ఫారూఖ్‌ విజయం సాధించారు. బీజేపీతో కలిసి కొన్నేళ్లు సంకీర్ణ సర్కారు నడిపిన తర్వాత విడిపోయిన కారణంగా పీడీపీకి జనాదరణ తగ్గిందని భావిస్తున్నారు. పీడీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ లేకపోవడం అబ్దుల్లాకు అనుకూలాంశమే.

అయితే, గతంలో తీవ్రవాదిగా ఉండి ప్రజాతంత్ర పంథా ఎంచుకున్న పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ (పీసీ) నేత సజ్జద్‌ గనీ లోన్‌ రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ పక్షాలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారు. కిందటేడాది చివర్లో జరిగిన శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను నేషనల్‌ కాన్ఫరెన్స్, పీడీపీ బహిష్కరించడంతో పీసీ అభ్యర్థి నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పార్టీ తరఫున ఇర్ఫాన్‌ అన్సారీ ఇక్కడ పోటీలో ఉన్నారు. రాజకీయాలకు అన్సారీ కొత్తే అయినా ఫారూఖ్‌కు గట్టి పోటీ ఇస్తున్నారనీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు పడే ఓట్లను ఆయన గణనీయంగా చీల్చుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. పీసీ అభ్యర్థి రంగంలోకి దిగడం వల్ల అబ్దుల్లా గెలుపు అంత సులభం కాదని అంటున్నారు.

తీవ్రవాద కార్యకలాపాలు శ్రీనగర్‌ పరిధిలో తక్కువే
ఉత్తర, దక్షిణ కశ్మీర్‌తో పోల్చితే ఈ నియోజకవర్గ పరిధిలో వేర్పాటువాద తీవ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువ. కాని, పోలింగ్‌ బహిష్కరణకు ఇచ్చిన పిలుపు 2017 ఉప ఎన్నికలో పనిచేసింది. ఈసారి కూడా ఎంత శాతం జనం ఓటు హక్కు వినియోగించకుంటారో చెప్పడం కష్టం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారూఖ్‌ ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. శ్రీనగర్‌లో కాంగ్రెస్‌ పోటీ పెట్టలేదు. జమ్మూ, ఉధంపూర్‌లో కాంగ్రెస్‌కు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మద్దతు ఇస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 81 ఏళ్ల ఫారూఖ్‌ గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని ఆయన పార్టీ నమ్ముతోంది. బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రంలో సంకీర్ణ సర్కారు నడపడంతో పీడీపీ జనాదరణ కోల్పోయింది. కాంగ్రెస్‌ వ్యతిరేక వాతావరణం కూడా పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత గెలుపుపై అనుమానాలు అనవసరమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement