అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఊహించినట్టే అత్యంత వాడీవేడిగా జరగుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి పాకిస్థాన్ అంశం రచ్చరచ్చ చేస్తోంది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీయే దాయాది అంశాన్ని ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా వాడుకున్నారు. కాంగ్రెస్-పాకిస్థాన్ కలిసి గుజరాత్ ఎన్నికల్లో కుట్ర పన్నారని ఆరోపించారు.
ఇప్పుడు తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం పాక్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రధాని మోదీ నోట ‘కాంగ్రెస్-పాక్’కుట్ర అన్న కొత్త మాట వెలువడగా.. రూపానీ మాత్రం గతంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. కాంగ్రెస్ గెలిస్తే.. పాకిస్థాన్‌లో పటాకులు పేలుతాయంటూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో షా ఉద్ఘాటించిన వ్యాఖ్యలు తెలిసిందే. నాటి బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది.
ఇప్పుడు గుజరాత్ సీఎం రూపానీ కూడా అదే మాటను ఉపయోగించారు. భారత పాల నగరంగా పేరొందిన ఆనంద్‌లో మంగళవారం ఆయన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ‘బీజేపీ గెలిస్తే గుజరాత్‌లో పటాకులు పేలుతాయి. అదే కాంగ్రెస్ గెలిస్తే పాకిస్థాన్‌లో టపాసులు మోగుతాయి’ అని ఆయన అన్నారు.
గుజరాత్ ప్రచారపర్వంలో ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చేస్తున్న పాకిస్థాన్ ప్రస్తావన రాజకీయ విశ్లేషకులను విస్మయపరుస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా వెనుకబడిపోయామన్న ఆందోళనతోనే వారు ప్రచారంలో తీవ్ర ఆరోపణలు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సర్వేలు, విశ్లేషకుల మాట ఎలా ఉన్నా.. 20 ఏళ్లపాటు అధికారంలోఉన్న బీజేపీ తిరిగి ‘పవర్’ నిలబెట్టుకుంటుందా? లేక కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని సాధిస్తుందా? అన్నది మరికొన్నిరోజుల్లో ఫలితాల్లో వెల్లడి కానుంది.
Comments
Please login to add a commentAdd a comment