
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, సిటీ కాంగ్రెస్ కీలక నాయకుడు దానం నాగేందర్ హస్తం పార్టీతో తన బంధాన్ని తెంచుకున్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ, తెలంగాణ పరిశీలకుడు అశోక్ గెహ్లాట్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు లేఖలు రాశారు. పార్టీలో బడుగులు, బీసీలకు అన్యాయం జరుగుతోందన్న కారణంగానే వెళ్లిపోతున్నట్లు దానం లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. కాగా, ఇటీవలే సంస్థాగత పదవుల భర్తీలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని కోల్పోయినప్పటి నుంచీ దానం అసంతృప్తితో రగిలిపోతున్నట్లు, అందుకే రాజీనామా చేసినట్లు ఆయన వర్గీయులు పేర్కొన్నారు. రాజీనామా వార్తలు ప్రసారమైన కొద్దిసేపటికే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.. దానం ఇంటికి వెళ్లి, సముదాయించే ప్రయత్నం చేశారు.
టీఆర్‌ఎస్ నుంచి భారీ ఆఫర్?: దానం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారన్న వార్త ప్రస్తుతం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం(రేపు) దానం తన భవిష్యత్ కార్యాచరణను మీడియాకు వివరిస్తానని ఆయన కార్యాలయం తెలిపింది. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్‌ను వీడి కారు ఎక్కేందుకు తీవ్రంగా యంత్నించిన ఆయన... చివరి నిమిషంలో మనుసుమార్చుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా స్తంబ్ధుగా వ్యవహరిస్తోన్న దానం.. తన సిటీ ప్రెసిడెంట్ పదవిని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు కట్టబెట్టడంతో ఇంకాస్త కుంగిపోయారని తెలిసింది. అదేసమయంలో అధికార పార్టీ నుంచి భారీ ఆఫర్ రావడంతో ఆయన గులాబీ గూటిలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆ భారీ ఆఫర్ ‘సికింద్రాబాద్ ఎంపీ టికెట్’ అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే అధికారికంగా ఈ విషయాలేవీ నిర్ధారణ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment