మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు
వరంగల్ అర్బన్: చెన్నూరు అసెంబ్లీ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కేటాయించకపోవడంతో ఆయన అనుచరుడు నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్యను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గట్టయ్యను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి బాల్క సుమన్‌పై మండిపడ్డారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారిపై హత్యాయత్నం కేసు పెట్టించడం దారుణమన్నారు.
తన వర్గానికి సంబంధించిన వారు బాల్క సుమన్‌పై దాడి చేయలేదని స్పష్టం చేశారు. స్థానికేతరుడికి టికెట్ కేటాయించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. దాడి చేయించాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించారు. తాను ప్రజల మధ్య ఉండి రాజకీయం చేస్తానే తప్ప ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడనని చెప్పారు. బాల్క సుమన్ గురించి ఓయూ విద్యార్థులకు తెలుసునని విమర్శించారు. సుమన్ జీవిత చరిత్రను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందు బయట పెడతానని తెలిపారు. తనను మానసిక క్షోభకు గురిచేసేందుకే తనపై కుట్రలు చేస్తున్నారని వాపోయారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గట్టయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment