విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చిత్రంలో ఎమ్మెల్యే సురేష్
సాక్షి, హైదరాబాద్: తన పాలనపై తనకు నమ్మకముంటే ఒంటరిగా ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీకి ఎలాంటి నైతిక విలువలు, సిద్ధాంతాల్లేవన్నారు. ప్రజాభిమానం పొందలేకే.. దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్‌తో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌తో కలసి ఆయన శుక్రవారం హైదరాబాద్ వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తానిచ్చిన హామీలు నెరవేర్చానంటూ ప్రజాతీర్పు కోరుతున్నారని, ఏపీలో మాత్రం చంద్రబాబు కలిసొచ్చే పార్టీలతో పొత్తు అంటూ లీకులిస్తూ తమాషా చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
అవకాశవాదమే బాబు ఎజెండా
టీడీపీ మతతత్వ పార్టీనో, లౌకిక పార్టీనో చెప్పుకోలేని దుస్థితిలో ఉందన్నారు. ఎన్నికల లబ్ధికోసమే చంద్రబాబు వెంపర్లాడతాడన్నారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీకి వ్యతిరేమంటూ సీపీఐ, సీపీఎంలను కలుపుకుని టీడీపీ ఎన్నికలకెళ్లిందని, 1999లో ఆ పార్టీల్ని వదిలేసి బీజేపీతో అతుక్కున్నారని తెలిపారు. 2004లోనూ బీజేపీతోనే కలసి పోటీచేశారని, కేంద్రంలో ఆ పార్టీ ఓడిపోవడంతో దాంతో లాభం లేదనుకుని 2009లో టీఆర్‌ఎస్‌తోసహా కమ్యూనిస్టులను కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేసిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. 2014లో మోదీతో కలసి ప్రచారం చేశారని, ఇప్పుడు మళ్లీ బీజేపీ మతతత్వపార్టీ అని, ముస్లింలకోసం ఆ పార్టీని దూరం పెడుతున్నామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. స్వలాభంకోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడన్నారు.
అంత దమ్ము, ధైర్యం బాబుకుందా?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే.. ఐదేళ్ల తన పాలన, సంక్షేమ పథకాలే ఎజెండాగా ఒక్కడే ఎన్నికల బరిలోకి దిగారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఇష్టానుసారంగా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ వైఎస్ మాత్రం తన ఐదేళ్ల పాలనే రెఫరెండంగా చెబుతూ ఎన్నికల్లో విజయం సాధించారని గుర్తు చేస్తూ.. అంత దమ్ము, ధైర్యం చంద్రబాబుకుందా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని, పథకాలన్నీ ప్రజాదరణ పొందాయని చెప్పే వ్యక్తి ఒంటరిగా ఎన్నికలకు ఎందుకు వెళ్లట్లేదని నిలదీశారు.
దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్‌తోనే పొత్తా?
ఎన్నికల్లో లబ్ధికోసం కాంగ్రెస్‌పార్టీతో పొత్తుకు సిద్ధమైన నీచ సంస్కృతి చంద్రబాబుదని విమర్శించారు. ‘దేశాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్‌ను ఓడించాల్సిందే.. ప్రజలు మోదీవైపు చూస్తున్నారు.. కాంగ్రెస్ పాలనలో దేశం సర్వనాశనం.. అవినీతి అనకొండ సోనియాగాంధీ.. దేశాన్ని కాంగ్రెస్ అప్రదిష్టపాల్జేసింది.. కాంగ్రెస్‌తో వినాశనమే.. తల్లీకొడుకులతో ఢిల్లీ పాడయింది.. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేద్దాం...’ అంటూ గతంలో కాంగ్రెస్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గడికోట గుర్తుచేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్, దానికి సహకరించిన బీజేపీ రాష్ట్రానికి తీరని నష్టం చేశాయని, అలాంటి కాంగ్రెస్‌ను మేలు చేసే పార్టీ అనే రీతిలో చంద్రబాబు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ తరహా ద్వంద్వవైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. నాలుగున్నరేళ్ల పాలనపై నమ్మకం లేకనే పొత్తులకోసం పరితపిస్తున్నాడని, తద్వారా తన పాలన విఫలమైందని ఆయనే అంగీకరిస్తున్నాడన్నారు.
30 మందిని చంపేసి... అనుకూల నివేదికా?
గోదావరి పుష్కరాల సందర్భంగా తన ప్రచారంకోసం రూ.కోట్లు ఖర్చుపెట్టి లఘు చిత్రం తీసేందుకు చేసిన ప్రయత్నంలో తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, ఈ వాస్తవాన్ని కూడా మరుగుపరిచేలా ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని గడికోట అన్నారు. దీనిపై వేసిన సోమయాజులు కమిటీ రిపోర్టు ఆ రోజు మంచి ముహుర్తం ఉండటం వల్ల కలిగిన రద్దీతోనే ఘటన జరిగిందని పేర్కొనడం శోచనీయమన్నారు. చంద్రబాబు అక్కడ ఉండటం వల్ల రద్దీ పెరిగిందని, దీంతో తొక్కిసలాట వల్ల ఘటన జరిగిందని అదేరోజు జిల్లా కలెక్టర్ మాట్లాడిన మాటలు ఏమయ్యాయన్నారు. 30 మందిని పొట్టనబెట్టుకున్న కనీస బాధ కూడా చంద్రబాబుకు లేకపోవడం దుర్మార్గమన్నారు.
అంతా తప్పుడు ప్రచారమే!
ఎన్నికల హామీలన్నీ నెరవేర్చానని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీవాణి, రోజా లిఖితపూర్వకంగా వేసిన ప్రశ్నకు ప్రభుత్వమిచ్చిన సమాధానాన్ని శ్రీకాంత్‌రెడ్డి ఉదహరించారు. 2014 నుంచి 2018 వరకు జిల్లాలవారీగా డ్వాక్రా రుణాల మాఫీ వివరాలడిగితే.. ఈ కాలంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని సర్కారు జవాబిచ్చిందన్నారు. 2014 జూన్ నాటికి మిగిలున్న డ్వాక్రా రుణాలెంత? ఇప్పటివరకు మాఫీ చేసినవెన్ని? అని ప్రశ్నిస్తే.. రుణాలు 11,069 కోట్లు ఉన్నాయని, ఎలాంటి మాఫీ చేయలేదని చెప్పారని, డ్వాక్రా రుణాల మాఫీకి ఎలాంటి ప్రతిపాదనా తమ వద్ద లేదని ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. ఇలాంటి వ్యక్తి డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేశామని ఎలా చెబుతున్నాడని ప్రశ్నించారు.
సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే ఆదిమూలపు
అసెంబ్లీ సమావేశాలకు తమ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఖండించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటేస్తే తాము ఆ క్షణంలోనే అసెంబ్లీకి హాజరవుతామని స్పష్టతిచ్చారు. అసెంబ్లీ ప్రజాస్వామ్య పద్ధతిలో నడిస్తే తాము కచ్చితంగా హాజరవుతామన్నారు. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్య పరిరక్షణ పార్టీల బాధ్యతని, చట్టసభలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన సూచనలను ప్రస్తావించారు. టీడీపీలోకి ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, ఫిరాయింపుదారులకిచ్చిన మంత్రి పదవులు రద్దు చేయాలని ఎన్నిసార్లు కోరినా స్పీకర్ పట్టించుకోలేదన్నారు. అసెంబ్లీని ఏకపక్షంగా నడిపిస్తున్న చరిత్ర చంద్రబాబుదేనన్నారు. తాము నిర్మాణాత్మక సభా నిర్వహణను కోరుకుంటున్నామని, కానీ మంత్రి లోకేష్ మాత్రం ప్రతిపక్షం రాకపోవడమే మంచిదనడం అనైతికతకు నిదర్శనమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment