సాక్షి, హైదరాబాద్: అమరావతి బాండ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అప్పులు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అమరావతి బాండ్లపై 10 శాతానికి మించి వడ్డీ ఇస్తున్నారని.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకరా లేక స్టాక్ బ్రోకరా అని ప్రశ్నించారు. కేవలం రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేస్తే సరిపోదని సూచించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరువు కనబడటం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు బినామీలు ఉన్న చోటే నిధులు ఇస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ర్టానికి అప్పులు పెరిగి.. ఆస్తులు తగ్గాయని వ్యాఖ్యనించారు. ఏపీలోని 5 కోట్ల మంది ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు సెక్యూరిటీ కోసం నెలకు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా అంటూ నిలదీశారు. నీరు చెట్టు కార్యక్రమంలో టీడీపీ నేతలు 13 కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. సొంత ఖర్చుల కోసం కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాలు విసిరారు. చంద్రబాబు బీఎస్‌ఈలో గంట కొట్టడానికి ముంబై వెళ్లారని.. కానీ రానున్న రోజుల్లో చంద్రబాబు నెత్తిన ప్రజలే గంట కొడతారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment