
సాక్షి, హైదరాబాద్ : గతంలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకొనే చింటూ (కేటీఆర్), పింటూ (హరీష్‌రావు)లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, ఇందిరా శోభన్‌లు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. వారి మాటల్లోనే.. ‘ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కి పరిపాలన సాగిస్తున్న కేసీఆర్ వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. రైతు బంధు లేదు. వర్షాలు పడినా ఆదుకునే స్థితిలో ప్రభుత్వం లేదు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు. కార్మికులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ విషయంలో ఎంత చెప్పినా తక్కువే. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. మీడియాపైన విపరీతమైన ఒత్తిడి వల్ల నిజాలు బయటకు రావడం లేద’ని విమర్శించారు.
మంత్రులకు పదవీ భయం?
ఇంకా ‘దేశంలో ఎక్కడా ఇలాంటి దుర్మార్గ పాలన లేదు. అప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధ పాలన చేస్తున్నారు. ప్రతీ విషయంలో మేమే పోటుగాళ్లమంటూ ముందుకు వచ్చే కేటీఆర్, హరీష్‌లు ఎక్కడ పోయారు? రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే వీళ్లు ఒక్కమాట కూడా మాట్లాడటం లేదెందుకు? ఒకాయన జాయ్ 2019 అంటూ విలాసాలు చేస్తున్నారు. వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉంటే ఆ శాఖ మంత్రి ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. డెంగీతో అనేక మంది చనిపోతుంటే ఆరోగ్య మంత్రి పదవి భయంతో గొంతు మీద వేలాడుతున్న కత్తిని చూసి భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ప్రజలు తిరగబడకపోతే న్యాయం జరగదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేయాలి. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంద’ని వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment