హైదరాబాద్: ఉన్నత విద్యను వ్యాపారంగా మార్చి కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తెచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయకుండా సౌకర్యాలు కల్పించకుండా నిధులు కేటాయించకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని గురువారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు.
ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వస్తే ప్రభుత్వ వర్సిటీలు పూర్తిగా ఉనికి కోల్పోతాయని, ఫీజులు బాగా పెరిగి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో కార్పొరేట్ దోపిడీకి గేట్లు బార్లాగా తెరిచారని ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు నష్టం చేసే ఈ బిల్లును వెనక్కి తీసుకోకుంటే తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment