private university bill
-
ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లుకు ఆమోదం
-
అసెంబ్లీ నిరవధిక వాయిదా
-
‘ప్రైవేట్ వర్సిటీలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి’
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకే ప్రైవేట్ వర్సిటీ బిల్లును ప్రభుత్వం పాస్ చేసిందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు లేని ప్రైవేట్ వర్సిటీలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గురువారం బీసీ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 12 యూనివర్సిటీలు ఉండగా కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రైవేట్ వర్సిటీల్లో ఫీజులు లక్షల్లో ఉంటాయని, ఫీజు రీయింబర్స్ మెంట్ చేసే అవకాశం లేదన్నారు. -
కార్పొరేట్ల మేలుకే ప్రైవేట్ వర్సిటీ బిల్లు
హైదరాబాద్: ఉన్నత విద్యను వ్యాపారంగా మార్చి కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తెచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయకుండా సౌకర్యాలు కల్పించకుండా నిధులు కేటాయించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని గురువారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వస్తే ప్రభుత్వ వర్సిటీలు పూర్తిగా ఉనికి కోల్పోతాయని, ఫీజులు బాగా పెరిగి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో కార్పొరేట్ దోపిడీకి గేట్లు బార్లాగా తెరిచారని ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు నష్టం చేసే ఈ బిల్లును వెనక్కి తీసుకోకుంటే తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
అసెంబ్లీ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ గురువారం నిరవధిక వాయిదా పడింది. పదమూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో మొత్తం 11 బిల్లులకు ఆమోదం లభించింది. వీటిలో పంచాయతీ రాజ్ బిల్లు కూడా ఆమోదం ఉంది. మొత్తం 60 గంటల 58 నిమిషాల పాటు సభ కొనసాగింది. అసెంబ్లీలో పార్టీ బలాబలాలపై తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో 82 మంది టీఆర్ఎస్ సభ్యులు, 17 మంది కాంగ్రెస్, ఏడుగురు ఎంఐఎం, ఐదు మంది బీజేపీ, ముగ్గురు టీడీపీ, వామపక్షపార్టీల సభ్యులు ఇద్దరు, ఓ ఇండిపెండెంట్, ఓ నామినేటేడ్ ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లపై సస్పెన్షన్ వేటు పడటంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. అయితే విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించిన ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సభ ఆమోదించింది. బుధవారం విద్యార్థి సంఘాలు ప్రైవేటు యూనివర్శిటీ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే. -
ప్రైవేటు వర్సిటీల బిల్లుకు సభ ఓకే
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును బుధవారం శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలను నీరుగార్చడానికే ఈ బిల్లు తెస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వర్సిటీల్లో బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తూ ఇప్పుడు ప్రైవేట్ బాట పడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ, టీడీపీ, సీపీఎం వాకౌట్ చేశాయి. అయితే ప్రైవేటు వర్సిటీల విషయంలో ఎలాంటి ఆందోళన, అపోహలూ అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ వర్సిటీలను కాపాడుకుంటూనే ప్రైవేటుకు అనుమతిస్తున్నామన్నారు. వచ్చే జూన్, జూలై నాటికి వర్సిటీల్లో 1,061 అధ్యాపక ఖాళీలను భర్తీ చేస్తామని, వాటిని బలోపేతం చేస్తామని వెల్లడించారు. బిల్లుపై ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, సున్నం రాజయ్య, జలగం వెంకట్రావు లేవనెత్తిన అంశాలకు ఆయన బదులిచ్చారు. తెలంగాణ విద్యార్థులకు కూడా ప్రైవేట్ రంగంలో నాణ్యమైన విద్య అందించే ఉద్దేశంతోనే బిల్లు తెచ్చామన్నారు. ‘‘రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్న ప్రభుత్వం వర్సిటీలను బలహీనపరిచే చర్యలు చేపట్టదు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వరంగంలో విద్యాభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. గత ప్రభుత్వం వర్సిటీలిచ్చినా నిధులివ్వలేదు. పోస్టులు మంజూరు చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే నిధులిస్తోంది. పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతోంది’’అని చెప్పారు. ఉస్మానియా వర్సిటీపై ఎందుకంత కోపమని కె.లక్ష్మణ్ అనడాన్ని కడియం తప్పుబట్టారు. ‘‘రాష్ట్ర బీజేపీ నేతల ఆలోచనలు గ్రేటర్ హైదరాబాద్‌ను దాటడం లేదు. వారిది జాతీయ పార్టీ అని మరుస్తున్నారు. ప్రైవేటు వర్సిటీలకు ప్రభుత్వ భూమి ఇవ్వడం లేదు. మైనారిటీల కోసం వాటిలో ప్రత్యేకంగా చేపట్టాల్సిన చర్యలపై సభ్యులతో చర్చించి నిబంధనల్లో పొందుపరుస్తాం. అలాగే కార్పస్ ఫండ్ అంశాన్ని కూడా. ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించే నిబంధన పెట్టాం’’అన్నారు. సామాజిక రిజర్వేషన్లు లేవంటూ వాకౌట్.. సామాజిక రిజర్వేషన్లను బిల్లులో పొందుపరచలేదంటూ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, సున్నం రాజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రైవేటు వ్యాపారానికి బిల్లు అవకాశం కల్పించేలా ఉంది. దీంతో రాష్ట్రంలోని వర్సిటీలు పూర్తిగా దెబ్బతింటాయి. బిల్లులో రాష్ట్ర విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని ఉందే తప్ప, సామాజిక రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తావన లేదు. మంత్రి స్పష్టతా ఇవ్వలేదు. వర్సిటీలను బలోపేతం చేయాలన్న ఆలోచన ఉంటే నాలుగేళ్లుగా చేయలేదేం? ఉస్మానియా, కాకతీయ వర్సిటీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు వర్సిటీల్లో అన్ని కోర్సులకు అనుమతిస్తే మిగతావి ఏం కావాలి?’’అని ప్రశ్నించారు. బిల్లును ఉపసంహరించాలని సీపీఎం, సెలెక్ట్ కమిటీకి పంపి మార్పుచేర్పులు చేయాలని బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వారి వాకౌట్ అనంతరం బిల్లును సభ ఆమోదించింది. -
కార్పొరేట్’ల కోసమే ప్రైవేటు వర్సిటీలు: చాడ
సాక్షి, హైదరాబాద్: కొందరు బడా సంపన్నులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకోసమే ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును టీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మఖ్దూంభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరి స్వలాభాలకోసం పేద విద్యార్థులకు విద్యను భారం చేయనున్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. విద్యను ప్రైవేటుపరం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ సంస్థలకు లొంగిపోయిందని, అందుకే ప్రైవేటు సంస్థలకు ద్వారాలు తెరుస్తున్నదని ఆయన ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్షంగానే ఉండాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రైవేటు వర్సిటీల్లో మనోళ్లకు కోటా
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందగానే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీనికి తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీ (ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ –2018గా పేరు పెట్టింది. చట్టం అమల్లోకి రాగానే యూనివర్సిటీల ఏర్పాటు మొదలవుతుంది. నాణ్యతతో కూడిన విద్యను అందించేలా, పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తూ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, ఆధునిక పరిస్థితులకు పెద్దపీట వేస్తూ ప్రపంచస్థాయి వర్సిటీల ఏర్పాటుకు అనుమతించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధన పొందుపరిచింది. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చవచ్చని పేర్కొంది. బిల్లులోని ప్రధానాంశాలివీ.. ♦ ఈ చట్టం కింద ఏర్పాటయ్యే విద్యా సంస్థలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కోర్సుల నిర్వహణ, ప్రవేశాల విధానం ఆయా వర్సిటీలే నిర్ణయిస్తాయి. ♦ ఫీజులను యూనివర్సిటీనే నిర్ణయిస్తుంది. ప్రతి యూనివర్సిటీ ఫీ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసి ఫీజులను ఖరారు చేయాలి. ఆ కమిటీలో బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్, అకడమిక్ కౌన్సిల్‌కు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. లింగ వివక్ష, ప్రాంతం, కులం, పుట్టిన ప్రదేశం, మతం, రాజకీయ కోణం, ఇతర కారణాలతో ఎవరికీ ప్రవేశాలను తిరస్కరించడానికి వీల్లేదు. ♦ తెలంగాణలో ఇప్పటికే ఉన్న విద్యా సంస్థలు యూనివర్సిటీగా ఏర్పడితే ప్రవేశాల్లో పాత విధానమే అమలు చేయాలి. సీట్ల భర్తీలో ఇప్పుడున్న రూల్ ఆఫ్ రిజర్వేషనే వర్తిస్తుంది. ఫీజు విధానం కూడా ఇప్పుడు ఉన్నట్టే కొనసాగుతుంది. తెలంగాణ ఫీజుల నియంత్రణ, ప్రవేశాల కమిటీ నిర్ణయించిన ప్రకారమే కొనసాగుతాయి. ♦ యూనివర్సిటీలు ఏర్పాటైన ఐదేళ్లలోగా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ నుంచి గుర్తింపు పొందాలి. ♦ యూనివర్సిటీలకు ఎంత భూమి ఉండాలి.. కార్పస్ ఫండ్ ఎంత ఉండాలన్న నిబంధనను చట్టంలో పొందుపరచలేదు. నిర్ణీత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని మాత్రం పేర్కొంది. ♦ యూజీసీ, ఏఐసీటీఈ, ఎంసీఐ, ఎన్సీటీఈ తదితర జాతీయ స్థాయి విద్యా సంస్థల నిబంధనలకు లోబడే కోర్సులను రూపొందించాలి. ♦ యూనివర్సిటీల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థల నుంచి వచ్చే దరఖాస్తులను(ప్రాజెక్టు రిపోర్టు) పరిశీలించి, అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. ♦ ప్రాజెక్టు రిపోర్టు వచ్చిన 30 రోజుల్లో ఆమోదించడమా? రిజెక్ట్ చేయడమా? అన్న దానిపై నిపుణుల కమిటీ నిర్ణయాన్ని తెలియజేస్తుంది. అనుమతి ఇచ్చిన ఏడాదిలోగా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ♦ యూనివర్సిటీకి చాన్స్‌లర్ ఉంటారు. వర్సిటీని ఏర్పాటు చేసిన సంస్థ చాన్స్‌లర్‌ను నియమిస్తుంది. ఆయన ముగ్గురితో కూడిన ప్యానెల్ నుంచి ఒకరిని వైస్ చాన్స్‌లర్‌గా నియమిస్తారు. తొలగించే అధికారం ఆయనకే ఉంటుంది. 70 ఏళ్లలోపు వారిని వీసీగా నియమిస్తారు. ఆయన పదవీకాలం గరిష్టంగా మూడేళ్లు ఉంటుంది. రిజిస్ట్రార్‌ను చాన్స్‌లరే నియమిస్తారు. ♦ యూనివర్సిటీని రాష్ట్ర భౌగోళిక పరిధిలోనే ఏర్పాటు చేయాలి. ఇవి మరే కాలేజీలకు, మరే కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదు ♦ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్సులతోపాటు పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ యూనివర్సిటీలు రెండు అదనపు క్యాంపస్‌లు/సెంటర్లు ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇవీ నాణ్యత ప్రమాణాలు, వాస్తవిక అవసరాల మేరకు ఉంటాయి ♦ ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో అదనపు క్యాంపస్‌ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వొచ్చు. ఐదేళ్లలో అక్కడ కల్పించే మౌలిక సదుపాయాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని కొనసాగించాలా? లేదా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటుంది ♦ ప్రభుత్వ గ్రాంట్స్ ఉండవు. గౌరవ డిగ్రీలు వర్సిటీలే ఇచ్చుకోవచ్చు ♦ ప్రపంచంలో ఏ యూనివర్సిటీతో అయినా ఒప్పందం చేసుకోవచ్చు. ♦ నిధుల సేకరణ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. ఇతర దేశాల నుంచి కూడా నిధులు సేకరించుకోవచ్చు. యూనివర్సిటీల గవర్నింగ్ బాడీలో మెంబర్‌గా కార్యదర్శి, ఆపై స్థాయి ప్రభుత్వ అధికారి ఉంటారు. ఏడాదికి 4సార్లు గవర్నింగ్ బాడీ భేటీ కావాలి ♦ ప్రభుత్వం సూచనలు ఇస్తుంది. ఇబ్బందులు వచ్చినపుడు జోక్యం చేసుకుంటుంది. ♦ ప్రభుత్వ అనుమతి లేకుండా యూనివర్సిటీ మూసేయొద్దు. -
అఖిల పక్షాన్ని కలుస్తాం
భూ సేకరణ, ప్రైవేటు వర్సిటీ బిల్లుపై ప్రొఫెసర్ కోదండరాం కరీంనగర్: రైతుల నుంచి భూసేకరణ, పునరావాస ప్యాకే జీ విషయంతోపాటు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై త్వరలో అఖిలపక్ష పార్టీల నాయకులను కలుస్తామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. భూసేకరణలో రైతులకు అన్యాయం చేయొద్దని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తూ నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు రాజ్యామేలుతున్నాయని, ప్రైవేటీకరణ వల్ల విద్య అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. ఇసుక, గ్రానైట్ వ్యాపారాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సామా న్యుడికి ఒక ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితుల్లో టన్నుల కొద్ది ఇసుక అక్రమంగా తరలిపోతోందని చెప్పారు. గత ప్రభుత్వాలకు.. ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏమీ లేకపోవడం విచారక రమన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు గండిప డేందుకు కారణమైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి మీన మేషాలు లెక్కించడంలో ఆంతర్యమేమి టని, పాత కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త కాం ట్రాక్టర్‌కు టెండర్ల ద్వారా మిడ్‌మానేరు ప్రాజెక్టును రెండింతలు అంచనాలు పెంచి ఇవ్వడం ప్రజాధనం దుర్వినియోగం చేయ డం కాదా? అని ప్రశ్నించారు. జేఏసీ, టీవీవీ ప్రజలపక్షాన నిలుస్తుందని, జేఏసీ ఎవరికి తొత్తుగా ఉండబోదని స్పష్టం చేశారు.