సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందగానే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీనికి తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీ (ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ –2018గా పేరు పెట్టింది. చట్టం అమల్లోకి రాగానే యూనివర్సిటీల ఏర్పాటు మొదలవుతుంది.
నాణ్యతతో కూడిన విద్యను అందించేలా, పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తూ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, ఆధునిక పరిస్థితులకు పెద్దపీట వేస్తూ ప్రపంచస్థాయి వర్సిటీల ఏర్పాటుకు అనుమతించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా విద్యా సంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబంధన పొందుపరిచింది. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చవచ్చని పేర్కొంది.
బిల్లులోని ప్రధానాంశాలివీ..
♦ ఈ చట్టం కింద ఏర్పాటయ్యే విద్యా సంస్థలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కోర్సుల నిర్వహణ, ప్రవేశాల విధానం ఆయా వర్సిటీలే నిర్ణయిస్తాయి.
♦ ఫీజులను యూనివర్సిటీనే నిర్ణయిస్తుంది. ప్రతి యూనివర్సిటీ ఫీ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసి ఫీజులను ఖరారు చేయాలి. ఆ కమిటీలో బోర్డు ఆఫ్ మేనేజ్‌మెంట్, అకడమిక్ కౌన్సిల్‌కు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. లింగ వివక్ష, ప్రాంతం, కులం, పుట్టిన ప్రదేశం, మతం, రాజకీయ కోణం, ఇతర కారణాలతో ఎవరికీ ప్రవేశాలను తిరస్కరించడానికి వీల్లేదు.
♦ తెలంగాణలో ఇప్పటికే ఉన్న విద్యా సంస్థలు యూనివర్సిటీగా ఏర్పడితే ప్రవేశాల్లో పాత విధానమే అమలు చేయాలి. సీట్ల భర్తీలో ఇప్పుడున్న రూల్ ఆఫ్ రిజర్వేషనే వర్తిస్తుంది. ఫీజు విధానం కూడా ఇప్పుడు ఉన్నట్టే కొనసాగుతుంది. తెలంగాణ ఫీజుల నియంత్రణ, ప్రవేశాల కమిటీ నిర్ణయించిన ప్రకారమే కొనసాగుతాయి.
♦ యూనివర్సిటీలు ఏర్పాటైన ఐదేళ్లలోగా నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ నుంచి గుర్తింపు పొందాలి.
♦ యూనివర్సిటీలకు ఎంత భూమి ఉండాలి.. కార్పస్ ఫండ్ ఎంత ఉండాలన్న నిబంధనను చట్టంలో పొందుపరచలేదు. నిర్ణీత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని మాత్రం పేర్కొంది.
♦ యూజీసీ, ఏఐసీటీఈ, ఎంసీఐ, ఎన్‌సీటీఈ తదితర జాతీయ స్థాయి విద్యా సంస్థల నిబంధనలకు లోబడే కోర్సులను రూపొందించాలి.
♦ యూనివర్సిటీల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థల నుంచి వచ్చే దరఖాస్తులను(ప్రాజెక్టు రిపోర్టు) పరిశీలించి, అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుంది.
♦ ప్రాజెక్టు రిపోర్టు వచ్చిన 30 రోజుల్లో ఆమోదించడమా? రిజెక్ట్ చేయడమా? అన్న దానిపై నిపుణుల కమిటీ నిర్ణయాన్ని తెలియజేస్తుంది. అనుమతి ఇచ్చిన ఏడాదిలోగా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి.
♦ యూనివర్సిటీకి చాన్స్‌లర్ ఉంటారు. వర్సిటీని ఏర్పాటు చేసిన సంస్థ చాన్స్‌లర్‌ను నియమిస్తుంది. ఆయన ముగ్గురితో కూడిన ప్యానెల్ నుంచి ఒకరిని వైస్ చాన్స్‌లర్‌గా నియమిస్తారు. తొలగించే అధికారం ఆయనకే ఉంటుంది. 70 ఏళ్లలోపు వారిని వీసీగా నియమిస్తారు. ఆయన పదవీకాలం గరిష్టంగా మూడేళ్లు ఉంటుంది. రిజిస్ట్రార్‌ను చాన్స్‌లరే నియమిస్తారు.
♦ యూనివర్సిటీని రాష్ట్ర భౌగోళిక పరిధిలోనే ఏర్పాటు చేయాలి. ఇవి మరే కాలేజీలకు, మరే కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదు
♦ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్సులతోపాటు పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ యూనివర్సిటీలు రెండు అదనపు క్యాంపస్‌లు/సెంటర్లు ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇవీ నాణ్యత ప్రమాణాలు, వాస్తవిక అవసరాల మేరకు ఉంటాయి
♦ ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో అదనపు క్యాంపస్‌ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వొచ్చు. ఐదేళ్లలో అక్కడ కల్పించే మౌలిక సదుపాయాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని కొనసాగించాలా? లేదా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటుంది
♦ ప్రభుత్వ గ్రాంట్స్ ఉండవు. గౌరవ డిగ్రీలు వర్సిటీలే ఇచ్చుకోవచ్చు
♦ ప్రపంచంలో ఏ యూనివర్సిటీతో అయినా ఒప్పందం చేసుకోవచ్చు.
♦ నిధుల సేకరణ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. ఇతర దేశాల నుంచి కూడా నిధులు సేకరించుకోవచ్చు. యూనివర్సిటీల గవర్నింగ్ బాడీలో మెంబర్‌గా కార్యదర్శి, ఆపై స్థాయి ప్రభుత్వ అధికారి ఉంటారు. ఏడాదికి 4సార్లు గవర్నింగ్ బాడీ భేటీ కావాలి
♦ ప్రభుత్వం సూచనలు ఇస్తుంది. ఇబ్బందులు వచ్చినపుడు జోక్యం చేసుకుంటుంది.
♦ ప్రభుత్వ అనుమతి లేకుండా యూనివర్సిటీ మూసేయొద్దు.
Comments
Please login to add a commentAdd a comment