సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును బుధవారం శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలను నీరుగార్చడానికే ఈ బిల్లు తెస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వర్సిటీల్లో బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తూ ఇప్పుడు ప్రైవేట్ బాట పడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ, టీడీపీ, సీపీఎం వాకౌట్ చేశాయి. అయితే ప్రైవేటు వర్సిటీల విషయంలో ఎలాంటి ఆందోళన, అపోహలూ అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ వర్సిటీలను కాపాడుకుంటూనే ప్రైవేటుకు అనుమతిస్తున్నామన్నారు. వచ్చే జూన్, జూలై నాటికి వర్సిటీల్లో 1,061 అధ్యాపక ఖాళీలను భర్తీ చేస్తామని, వాటిని బలోపేతం చేస్తామని వెల్లడించారు.
బిల్లుపై ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, సున్నం రాజయ్య, జలగం వెంకట్రావు లేవనెత్తిన అంశాలకు ఆయన బదులిచ్చారు. తెలంగాణ విద్యార్థులకు కూడా ప్రైవేట్ రంగంలో నాణ్యమైన విద్య అందించే ఉద్దేశంతోనే బిల్లు తెచ్చామన్నారు. ‘‘రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్న ప్రభుత్వం వర్సిటీలను బలహీనపరిచే చర్యలు చేపట్టదు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వరంగంలో విద్యాభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. గత ప్రభుత్వం వర్సిటీలిచ్చినా నిధులివ్వలేదు. పోస్టులు మంజూరు చేయలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే నిధులిస్తోంది.
పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతోంది’’అని చెప్పారు. ఉస్మానియా వర్సిటీపై ఎందుకంత కోపమని కె.లక్ష్మణ్ అనడాన్ని కడియం తప్పుబట్టారు. ‘‘రాష్ట్ర బీజేపీ నేతల ఆలోచనలు గ్రేటర్ హైదరాబాద్‌ను దాటడం లేదు. వారిది జాతీయ పార్టీ అని మరుస్తున్నారు. ప్రైవేటు వర్సిటీలకు ప్రభుత్వ భూమి ఇవ్వడం లేదు. మైనారిటీల కోసం వాటిలో ప్రత్యేకంగా చేపట్టాల్సిన చర్యలపై సభ్యులతో చర్చించి నిబంధనల్లో పొందుపరుస్తాం. అలాగే కార్పస్ ఫండ్ అంశాన్ని కూడా. ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించే నిబంధన పెట్టాం’’అన్నారు.
సామాజిక రిజర్వేషన్లు లేవంటూ వాకౌట్..
సామాజిక రిజర్వేషన్లను బిల్లులో పొందుపరచలేదంటూ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, సున్నం రాజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రైవేటు వ్యాపారానికి బిల్లు అవకాశం కల్పించేలా ఉంది. దీంతో రాష్ట్రంలోని వర్సిటీలు పూర్తిగా దెబ్బతింటాయి. బిల్లులో రాష్ట్ర విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని ఉందే తప్ప, సామాజిక రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రస్తావన లేదు. మంత్రి స్పష్టతా ఇవ్వలేదు. వర్సిటీలను బలోపేతం చేయాలన్న ఆలోచన ఉంటే నాలుగేళ్లుగా చేయలేదేం? ఉస్మానియా, కాకతీయ వర్సిటీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు వర్సిటీల్లో అన్ని కోర్సులకు అనుమతిస్తే మిగతావి ఏం కావాలి?’’అని ప్రశ్నించారు. బిల్లును ఉపసంహరించాలని సీపీఎం, సెలెక్ట్ కమిటీకి పంపి మార్పుచేర్పులు చేయాలని బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వారి వాకౌట్ అనంతరం బిల్లును సభ ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment